గూగుల్ లో 48 మంది ఉద్వాసన.. ఎందుకో తెలుసా?
అసభ్యంగా ప్రవర్తించే ఉద్యోగులపై గూగుల్ సంస్థ కొరడా రుళిపిస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొన్నది. 2016 నుంచి ఈ చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థ ఈసీవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ అంశాన్ని వెల్లడించారు. తొలగించిన వారిలో 13 మంది సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన రిపోర్ట్‌పై సీఈవో పిచాయ్ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. సంస్థ నుంచి బయటకు పంపించినవారికి ఎటువంటి ప్యాకేజీ కూడా ఇవ్వలేదని సీఈవో తెలిపారు. కొందరు ఉద్యోగులకు భారీ మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి సంస్థ నుంచి వెలివేశారని వచ్చిన ఆరోపణలపై పిచార్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పిచాయ్ తెలిపారు. ప్రవర్తన సరిగా లేదని, లేదా లైంగికంగా వేధించాడని వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణంగా సమీక్షిస్తామని, ఆ ఫిర్యాదులపై విచారణ చేపట్టాకే, చర్యలు తీసుకుంటామని పిచాయ్ తన లేఖలో వివరించారు. ఆండ్రాయిడ్ క్రియేటర్ ఆండీ రూబెన్ 2014లో సంస్థను వీడిన ఘటన పట్ల ఫిర్యాదులు రావడంతో గూగుల్ సీఈవో ఈ వివరాలు వెల్లడించాల్సి వచ్చింది.













