మనపై గూగుల్ నిఘా
మనం వాడే ఫోన్ మనపై నిఘా నేత్రంగా మారుతున్నది. గూగుల్ సంస్థ దొంగ చాటుగా మన కదలికలను రికార్డు చేస్తున్నది. జీపీఎస్ ఆఫ్ చేసినా, లొకేషన్ హిస్టరీ క్లోజ్ చేసినా, హిస్టరీ క్లియర్ చేసినా, సెట్టింగ్స్ ఆఫ్ చేసినా ఫలితం ఉండటం లేదు. మన ఫోన్లోని మిగతా గూగుల్ యాప్స్ సహాయంతో మనం ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నామో రికార్డు చేస్తున్నది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్లపైనా గూగుల్ ఐ నిరంతరం కొనసాగుతున్నది. అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)పరిశోధనలో తేలిన కఠిన వాస్తవాలు ఇవి. వినియోగదారుల గోప్యతకు గూగుల్ కనీస గౌరవం ఇవ్వడం లేదని తేల్చింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులు, కోట్ల మంది గూగుల్ యాప్స్ వినియోగిస్తున్న ఐఫోన్ యూజర్ల ప్రైవసీకి భంగం వాటిలుతున్నదని పేర్కొన్నది.













