గూగుల్ సాఫ్ట్ వేర్ చెప్పిందే నిజమైంది!
చివరిదశ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ ఓ మహిళ ఆసుపత్రిలో చేరింది. అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేసి, వైద్యం పొందుతుండగానే ఆమె మరణించడానికి 9.3 శాతం అవకాశముందని వైద్యులు అంచనా వేశారు. తర్వాత, గూగుల్ రూపొందించిన అల్గారిథమ్ ఆమె సంబంధించిన ఆరోగ్య వివరాలన్నింటినీ పరిశీలించింది. ఒకటికాదు, రెండకాదు మొత్తం 1,75,639 అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఆమె ఆసుపత్రిలో ఉండగానే మరణించేందుకు 19.9 శాతం అవకాశముందని లెక్కగట్టింది. చివరికి గూగుల్ సాఫ్ట్వేర్ చెప్పిందే నిజమైంది. ఆ సంస్థ హెల్త్ కేర్ విభాగం కృత్రిమ మేధస్సు( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించే సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఆసుపత్రిలో చేరిన రోగి ఎంతకాలం అక్కడ ఉండాల్సి వస్తుంది? వ్యాధి తీవ్రత ఎలా ఉంది? మళ్లీ ఆసుపత్రికి రావాల్సి ఉంటుందా? మరణముప్పు ఉందా? వంటి ప్రశ్నలకు ఇది అత్యంత వేగంగా దాదాపు కచ్చితమైన సమాధానాలు చెబుతుండటం విశేషం.
బాధితుల రోగ చరిత్రను తెలుసుకుని ఇప్పటివరకూ వాడిన మందులేంటో చూసి, వారి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు, నిపుణులు చాలా సమయం పడుతోంది. అయితే, గూగుల్ రూపొందించిన ఈ సరికొత్త హెల్త్ టూల్ విశ్లేషణ పనులన్నింటినీ అత్యంత కచ్చితత్వంతో చేస్తున్నట్లు సంస్థ నిపుణులు చెబుతున్నారు. తద్వారా వైద్యులు చికిత్సపై దృష్టి సారించే వీలుంటుందని భావిస్తున్నారు. సీనియర్ వైద్యుల్లా ఈ సాఫ్ట్వేర్ కూడా వ్యాధి తీవ్రతను అంచనా కట్టి, భవిష్యత్ పరిణామాలను ఊహించగలదట. ఈ ఆఫ్లికేషన్ను ఆసుపత్రులకు అందజేయడమే తదుపరి అంకమని గూగుల్ మెడికల్ బ్రెయిన్ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) చీఫ్ జెఫ్ డీన్ వెల్లడించారు.













