తెలంగాణలో అమెరికా సంస్థ ఆంథెం
ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆరోగ్య పరిరక్షణ సేవల సంస్థ ఆంథెం తెలంగాణలోనూ తమ ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.3వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తుంది. కంపెనీ ప్రతి నిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ ప్రతిపాదలను వెల్లడించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అమెరికాలోని ఇండియానా పోలీసు కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆంథెంకు ఏటా 90 బిలియన్ డాలర్ల వార్షికాదాయం గల సంస్థ. వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్త ప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుంది. అత్యుత్తమ మానవ వనరులు, సత్వర పారిశ్రామిక అనుమతులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో పురోగమం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని హైదరాబాద్‌ను ఎంపిక చేశామని తెలిపారు.













