సీనియర్ బుష్ ఇకలేరు
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హర్బెర్ట్ వాకర్ బుష్ (94) కన్నుమూశారు. యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పని చేసిన జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్ శుక్రవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బుష్ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. 1989 నుంచి 1993 వరకు అధ్యక్ష పదవిలో ఉన్న బుష్, అంతకు ముందు రెండు పర్యాయాలు (1981-1985, 1985-1989) ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతోంది. అలాంటి సందర్భంలో తన రాజనీతిజ్ఞతతో, చొరవతో ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారన్న ఖ్యాతి బుష్ సొంతం. బుష్ అనంతరం క్లింటన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.
బుష్ సతీమణి బార్బరా బుష్ మరణించిన కొన్ని నెలల్లోనే ఈయన కూడా మరణించారు. బుష్కు ఐదుగురు పిల్లలు, 17 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ను ఎక్కువగా బుష్ 41, జార్జ్ బుష్ సీనియర్ అని పిలుస్తారు. బుష్ పెద్ద కుమారుడి పేరు కూడా జార్జ్ డబ్ల్యూ బుష్ అయినందున ఇద్దరిని పిలవడంలో తేడా ఉండడం కోసం అలా పిలుస్తారు. బుష్ కుమారుడు జార్బ్ డబ్ల్యూ బుష్ కూడా అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.













