లండన్లో ఘనంగా గణపతి నిమజ్ఞనం
లండన్ నగరంలోని హౌంస్లోలో ప్రాంతంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్ఞనం జరిగాయి. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ సారి వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్ఞనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్ఞనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో నిమజ్ఞన కార్యక్రమంలో పాల్గొన్నారు.
లండన్ వీధులు గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ దద్దరిల్లాయి. బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి, ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, మల్లారెడ్డి, నవీన్ రెడ్డి, రాకేష్ పటేల్, సత్య మాట్లాడుతూ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుసుకొని వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.













