శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో ఫండ్ రైజింగ్
శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వార్షిక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్ నగరంలో నిర్వహించారు. సుమారు నాలుగు వందల మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్ మద్దిపాటి, సుధీర్ చెముడుగుంట అతిథులను ఆహ్వానించారు. శంకర ఐ ఫౌండేషన్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మశ్రీ డా.రమణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన శంకర్ ఐ ఫౌండేషన్ సభ్యులను సత్కరించారు. ఇప్పటివరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది కంటి ఆస్పత్రులను నిర్మించి దాదాపు 20 లక్షల మందికిపైగా కంటీ పరీక్షలు చేసి చూపు తీసుకొచ్చినట్లు శంకర్ ఐ ఫౌండేషన్ చైర్మన్ మురళీ కృష్ణమూర్తి వివరించారు.
భారత్లో అంధ్యత నివారణ కోసం శంకర ఐ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది ప్రవాస భారతీయులు తమవంతుగా కృషి చేస్తున్నారని ఫౌండేషన్ ప్రతినిధి సుధీర్ చెముడుగుంట అన్నారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల గురించి కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులకు వివరించారు. హైదరాబాద్, బిహార్, ముంబయి, ఇండోర్ నగరాల్లో శంకర ఐ ఫౌండేషన్ నిర్మించనున్న కంటి ఆస్పత్రులకు తగిన సాయం అందించాల్సిందిగా ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్ మద్దిపాటి ప్రవాస భారతీయులను కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు మూడు లక్షల డాలర్లు సేకరించినట్లు ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్, బిహార్, ముంబయి, ఇండోర్ నగరాల్లో నిర్మించనున్న ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.













