హార్వర్డ్ వర్సిటీలో నిరసన…
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల విద్యార్థులపై పోలీసులు అణిచివేత అమానుషంగా ఉన్నదని ప్రపంచంలోని పలు ప్రముఖ వర్సిటీల విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన దాదాపు 400 మంది విద్యార్థులు సంతకం చేసిన ప్రకటనను విడుదల చేశారు. మరోవైపు, లండన్లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ విద్యార్థులు ఇండియా హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ హార్వర్డ్ వర్సిటీ విద్యార్థులు.. భారత ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. తోటి విద్యార్థులపై పోలీసుల దాడిని చూస్తూ మౌనంగా ఉండలేకపోతున్నామంటూ కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక ప్రకటన జారీ చేశారు. కేంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థులు కూడా మౌన ప్రదర్శన జరిపారు. ఫిన్లాండ్లోని భారతీయ విద్యార్థులు అక్కడ ఉన్న భారతీయ రాయబార కార్యాలయంలో తమ నిరసనను తెలియజేశారు.













