TTA: టీటీఏ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూల్ జిమ్లో దివ్యాంగుల కోసం ఉచిత కృత్రిమ అవయవాల (Prosthetic Limbs) స్క్రీనింగ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందజేసిన కృత్రిమ అవయవాలను టీటీఏ (TTA) అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, వారి కుటుంబం అందించారు. ఖమ్మం రోటరీ ట్రస్ట్ నుండి శ్రీ రంగారావు.. ఈ శిబిరం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టి, సమన్వయం చేశారు. ఈ సేవా కార్యక్రమం 2025లో టీటీఏ (TTA) చేపట్టిన రెండవ కృత్రిమ అవయవాల దానం కాగా, మొత్తంగా ఇది ఐదవ ప్రోగ్రామ్ కావడం విశేషం. మహబూబ్నగర్లో జరిగిన ఈ స్క్రీనింగ్ క్యాంపులో సుమారు 130 మంది దివ్యాంగులు నమోదు చేసుకున్నారు. రాబోయే పంపిణీ శిబిరంలో 30 మందికి ట్రై సైకిళ్లు, 20 మంది వృద్ధులకు వీల్చైర్లు కూడా అందజేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ వెల్ఫేర్ శ్రీమతి జరీనా బేగం హాజరై టీటీఏ (TTA) సేవలను ప్రశంసించారు. డిసెంబర్ 20న జరగబోయే అవయవాల పంపిణీ వేడుకకు కూడా తాము హాజరవుతామని వారు హామీ ఇచ్చారు. టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఆర్.వి. నరసింహారెడ్డి, విజయ్ కుమార్ వంటి ప్రముఖులు ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించారు.







