ట్రంప్ తో తనకు అఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ప్లేబాయ్ మ్యాగజైన్ మాజీ మోడల్ కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ట్రంప్‌తో తనకు అఫైర్ ఉందని, ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు చేసుకున్న ఒప్పందం నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కరెన్ మెక్‌డౌగల్ దావా వేశారు. ట్రంప్‌తో సంబంధంపై మౌనంగా ఉండేందుకు నేషనల్ ఎన్‌క్వైరర్ పబ్లిషర్ అమెరికన్ మీడియా ఇన్ తనకు 1,50,000 డాలర్లు చెల్లించినట్లు కరెన్ దావాలో పేర్కొన్నారు.
2006-07 మధ్య 10 నెలల పాటు నాకు, ట్రంప్‌కు మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు తన లాయర్ కేత్ డేవిడ్సన్, ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్‌తో రహస్య మంతనాలు జరిగాయి. నాకు తెలియకుండానే నాతో ఆ ఒప్పందంపై సంతకం చేయించారు అని కరెన్ దావాలో పేర్కొన్నారు. అంతేగాక, ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు అమెరికన్ మీడియా ఇన్ కూడా తనకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు. తనకు తెలియకుండా చేసుకున్న ఒప్పందాన్ని చెల్లనిదిగా పరిగణించి, ఆ ఒప్పందం నుంచి తనకు విముక్తి కలిగించాలని కరెన్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు అమెరికన్ మీడియా ఇన్‌పై కూడా ఆమె దావా వేశారు.













