ఫోర్బ్స్ మేగజీన్ జాబితాలో తెలుగు తేజంకు చోటు
అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్‌లో తెలుగు తేజం మెరిసింది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన ఈ నెలలో ప్రచురించిన మేగజీన్‌లో అండర్-30 శాస్త్రవేత్త విభాగంలో చోటు దక్కించుకుంది. 2018 మేలో నిర్వహించిన ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు) ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు మేఘనను అత్యంత ప్రతిభాశాలిగా గుర్తించారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరావు, మాధవి అమెరికా నుంచి మీడియాకు తెలిపారు. ఫోర్బ్స్ మేగజీన్‌లో చోటు సంపాదించడంతో అటు అమెరికాలో, ఇటు భారత్‌లో ఉనికిలి యువతికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తల్లిదండ్రులతో కలిసి మేఘన అమెరికాలోని ఆర్క్‌నెస్ స్టేట్ లిటిల్ రాక్‌లో ఉంటోంది. సెంట్రల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈమెకు సైన్సు అంటే ఆసక్తి. 2018 మేలో ప్రపంచస్థాయిలో ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్ ఫేర్ పోటీల్లో 75 దేశాలతో పోటీపడి ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినమ్ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగం ప్రదర్శన ద్వారా ఐసెఫ్ అవార్డు సాధించింది. ఆ సందర్భంగా మేఘన అవార్డుతో పాటు 50 వేల డాలర్ల బహుమతి పొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.













