రెండు గంటల్లో న్యూయార్క్ టు లండన్
న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లాలని అనుకునేవారికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. ఒక్కో ఎయిర్‌లైన్స్‌కు ఒక్కో విధమైన సమయం పడుతుంది. అదే 7 గంటల ప్రయాణాన్ని 2 గంటలకే కదిస్తే ఎలా ఉంటుంది? అవునండి న్యూయార్క్ నుంచి లండన్‌కు కేవలం రెండు గంటల్లోనే చేర్చేందుకు రిచర్డ్ బ్రాన్సన్ సన్నాహాలు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి బోయింగ్స్ హైపర్ సోనిక్ విమానాన్ని తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రానున్న దశాబ్ద కాలంలో హైపర్ సోనిక్ జెట్ విమానరంగంలోకి అడుగుపెడుతుందని రిచర్డ్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైపర్ సోనిక్ విమానానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని అట్లాంటాలో కొన్ని రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ధ్వని వేగం కంటే 5 రేట్లు వేగంతో వెళ్లేలా దీన్ని రూపొందిస్తున్నారు. గంటకు 3,900 మైళ్ల వేగం (6,276 కి.మీ)తో దూసుకెళ్తుంది. గతంలో కాన్కోర్డ్ ఎయిర్‌లైన్ సంస్థ పరిచయం చేసిన సూపర్ సోనిక్ జెట్, ధ్వని వేగం కంటే రెండు రెట్లతో దూసుకెళ్లేది. దీనిలో న్యూయార్క్ నుంచి లండన్‌కు వెళ్లాలంటే మూడున్నర గంటల సమయం పడుతుంది. బోయింగ్ జెట్‌కు మాత్రం 2 గంటలు సరిపోతుంది. డిజైన్ రూపొందించడం జరిగిందని, ఈ కాన్సెప్ట్‌తో హైపర్ సోనిక్ జట్ ఆకాశంలో దూసుకెళ్లాలంటే కనీసం రెండు దశాబ్ధాల కాలం పడుతుందని బోయింగ్ వివరించింది. హైపర్ సోనిక్ వాహనాల తయారీ, అభివృద్ధి, ప్రయోగాలు, డిజైన్ రూపకల్పనకు ఆరు దశాబ్ధాల క్రితమే బోయింగ్ బీజం వేసిందని సీనియర్ టెక్నికల్ అధికారి, హైపర్ సోనిక్ చీఫ్ సైంటిస్టు కెవిన్ ఔకట్ తెలిపారు.













