అమెరికాలో తొలి కేసు నమోదు…
చైనాలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ దెబ్బకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. వైరస్‌బారిన పడిన బాధితుల సంఖ్య 440కి చేరినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ఉపమంత్రి లిన్ బిన్ వెల్లడించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వేగంగా పరివర్తనం చెందుతూ ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ వ్యాధి ఆసియాతో పాటు పశ్చిమ దేశాలకూ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. అమెరికాలో ఒప్పటికే ఒక కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సీయాటెల్లో నివసించే ఓ 30 ఏళ్ల వ్యక్తి అధికారులను సంప్రదించారు. అతను అనారోగ్యానికి గురవడంతో జరిపిన వైద్యపరిక్షల్లో సార్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించారు. ప్రస్తుతం అతనికి ప్రత్యేకవార్డులో చికిత్స అందజేస్తున్నారు.
గతంలో చైనాలోని ఉహాన్ నగరానికి వెళ్లిన ఆయన జనవరి 15న తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు.













