San Francisco: భారత్ అభివృద్ధిపైనే మోదీ ప్రభుత్వం దృష్టి : శాన్ఫ్రాన్సిస్కోలో నిర్మలా సీతారామన్
భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi) భారత్‌ను వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. ముఖ్యంగా సెమీకండక్టర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేథ మొదలైన వాటిల్లో పురోగమిస్తున్న భారత్.. భవిష్యత్తులో ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మరోవైపు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ నాటికి తొలి దశకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని కాలిఫోర్నియాలో ఎన్నారైలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చెప్పారు.
అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా వచ్చిన నిర్మలా సీతారామన్‌ను హార్ట్ఫుల్నెస్ సెంటర్లో భారత సంతతి పౌరుల వేదిక.. ఇండియన్ డయాస్పోరా ఘనంగా సత్కరించింది. అమెరికాలోని భారత దౌత్య అధికారి వినయ్ మోహన్ బట్, కాన్సుల్ జనరల్ శ్రీకర్‌రెడ్డి కొప్పులతోపాటు ఇతరులు ఆమెను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిలికాన్‌వ్యాలీలో పారిశ్రామికవేత్తలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, ముఖ్యంగా సృజనాత్మక రంగంలో వారు చేస్తున్న కృషి, ఇండియన్ డయాస్పోరాను నడుపుతున్నతీరును కొనియాడారు. ఫలితంగా అమెరికాలో భారత్‌ను ప్రత్యేక స్థానంలో నిలిపారని ప్రశంసించారు. భారతీయ స్టార్టప్ కంపెనీలతో భారతీయ ప్రవాసులు భాగస్వామ్యం వహించాలని, వారి జ్ఞానాన్ని పంచుకోవాలని ఆమె కోరారు, తద్వారా వారు మరియు వారి భాగస్వాములు మాత్రమే కాకుండా భారతదేశం మరియు అమెరికా రెండూ ప్రయోజనం పొందుతాయని తెలిపారు. 1 ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశమని ప్రపంచ బ్యాంకు చేసిన ధ్రువీకరణను ఆమె ప్రస్తావించారు మరియు భారతీయ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సముచితమని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌ను ఆమె ప్రస్తావించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా.. స్వేచ్ఛగా జీవించేందుకు.. సులభంగా పని చేసేందుకు తగిన వాతావరణ ఉండేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇదే భారత్‌ను సుస్థిరంగా ఉంచుతోందన్నారు. భారత్‌లో స్వచ్ఛమైన ప్రభుత్వం కొనసాగుతోందని. ప్రచారం కన్నా పాలనపైనే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మోదీ పాలనలో కొత్త కొత్త రంగాలకు కూడా అవకాశం లభిస్తోందన్నారు. అడ్వాన్స్ కెమిస్ట్రీ, పునరుత్పాదక బ్యాటరీల రంగాలను ఆమె ప్రస్తావించారు. వాణిజ్యం మరియు వ్యాపార సమస్యలపై మాత్రమే కాకుండా రక్షణ మరియు సైనిక భాగస్వామ్యంపై కూడా బలమైన మరియు సమగ్రమైన అమెరికా-భారతదేశ సంబంధాలపై చర్చలను ప్రారంభించడానికి ప్రధానమంత్రి మోదీ ఫిబ్రవరి 2025లోనే అమెరికా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత 200 బిలియన్ల డాలర్ల నుండి 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ల డాలర్లకు పెంచడానికి భారతదేశం మరియు అమెరికా కలిసి పని చేస్తాయని ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రకటనను ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి సీతారామన్‌తో ప్రశ్న మరియు జవాబు సెషన్‌ను కూడా నిర్వహించారు మరియు భారతదేశం యొక్క ప్రస్తుత దృష్టి ప్రాంతాల నుండి ఆర్థిక లోటు వరకు సంబంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా వినయ్ మోహన్ బట్ మాట్లాడుతూ.. అమెరికా-భారత్ సంబంధాలు ద్రుఢతరంగా ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల సంస్కృతి, విలువలను పరస్పరం పంచుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఆర్థికపరమైన సంబంధాలు కూడా.. ఇరు దేశాల మధ్య బలోపేతంగా సాగుతున్నాయని వినయ్ మోహన్ బట్ తెలిపారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ డయాస్పోరా కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అమెరికాలోని భారతీయ పౌరులకు తమ దౌత్య కార్యాలయం 24 గంటలూ తెరిచే ఉంటుందని చెప్పారు. అదేవిధంగా భారత పౌరుల కోసం బోస్టన్, లాస్ ఏంజెలెస్‌లలో కార్యాలయాలు త్యరలో అందుబాటులో ఉంటాయని, ఏ అవసరం వచ్చినా తాము వెంటనే స్పందిస్తామని వివరించారు.
బే ఏరియా ప్రజల సౌకర్యార్థం త్వరలో శాన్ హోసెలో విఎఫ్ఎస్ కార్యాలయాన్ని తెరుస్తున్నట్లు ప్రకటించారు. కాన్సుల్ జనరల్ శ్రీకర్‌రెడ్డి కొప్పుల కీలకోపన్యాసం చేసి, వందన సమర్పణ చేశారు.








