10 కోట్ల మంది ఇంటికే పరిమితం
దీర్ఘకాలంగా వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం, ఆపై కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో అమెరికా కార్మిక వర్గంలో దాదాపు 39 శాతం అంటే దాదాపు 10.1 కోట్ల మంది ఎలాంటి పని లేకుండా ఇంటి దగ్గరే ఉండిపోయారని ఫెడరల్ రిజర్వు డేటా తెలిపింది. ఈ సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఇప్పటికి దాదాపు 60 లక్షలకు పెరిగింది. ఫిబ్రవరిలో 9.5 కోట్లుగా ఉన్న ఇటువంటి వారి సంఖ్య ఏప్రిల్ నాటికి 10.3 కోట్లకు పెరిగింది. ఏప్రిల్, మే మాసాల్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ వంటివి విడనాడినప్పటికీ వీరి సంఖ్య మాత్రం 10కోట్లకు పైనే ఉండడం గమనార్హం.
ఆగస్టులో కొద్దిగా తగ్గినా, సెప్టెంబరులో మళ్లీ పెరిగింది. ఈ గణాంకాలు అమెరికాలో ఉగ్ర రూపం దాల్చిన నిరుద్యోగ సమస్యకు దర్పణం పడుతుంది. 2019 జనాభా లెక్కల ప్రకారం, అమెరికాలో దాదాపు 32,85,00,000 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 26 కోట్ల మంది 16 ఏళ్లకు పైబడిన వారు, 5.4 కోట్ల మంది లేదా 16.5 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారు ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 25 శాతం మంది ఇంకా పనిచేస్తునే వున్నారు.













