ఫేస్బుక్ పై 35000 కోట్ల భారీ జరిమానా
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారులను కలిగిన ఫేస్బుక్పై అత్యంత భారీమొత్తం జరిమానాల రూపంలో పిడుగు పడింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతలో నిబంధనలు ఉల్లంఘించినందుకే రూ.35,000 కోట్ల (5 బిలియన్ డాలర్ల) జరిమానాను నియంత్రణ సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విధించింది. కొత్త నిబంధనావళిని, మెరుగుపరచిన కార్పొరేట్ వ్యవస్థను కూడా ఫేస్బుక్ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికాలో మరే కంపెనీపైనా ఇంత మొత్తం జరిమానా విధించలేదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది.
మార్కెట్ల నియంత్రణ సంస్థ కూడా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.700 కోట్ల) జరిమానా విధించింది. వినియోగదారులు ఇచ్చే వ్యక్తిగత సమచారంపై నియంత్రణ వారికే ఉండేలా చూస్తామని ఫేస్బుక్ పలుమార్లు హామీలు ఇచ్చినా, అమలుకు వచ్చేసరికి ఆ విధంగా జరగలేదని ఎఫ్టీసీ చైర్మన్ జో సైమన్స్ పేర్కొన్నారు. ఫేస్బుక్ డైరెక్టర్ల బోర్డులోనే స్వతంత్ర వ్యక్తిగత గోప్యతా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఉన్న నష్టభయ (రిస్క్)నికి సంబంధించి తప్పుదోవ పట్టించే ధ్రువీకరణలు అందించినందుకు ఫేస్బుక్పై 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.700 కోట్ల) జరిమానాను మార్కెట్ల నియంత్రణ సంస్థ విధించింది. ఈ మొత్తం చెల్లించేందుకు ఫేస్బుక్ అంగీకరించింది.













