వారం ముందే రాజకీయ ప్రకటనలు నిషేధం : ఫేస్బుక్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారంరోజుల ముందే రాజకీయ ప్రచార ప్రకటనలపై నిషేధం అమలు చేస్తామని ఫేస్బుక్ ప్రకటించింది. ఓటింగ్ అనంతరం వచ్చే అంచనాలు, కోవిడ్ 19పై తప్పుడు సమాచారంపై తనిఖీలు నిర్వహిస్తూ పోస్టుల్ని తొలగిస్తామని కూడా ఫేస్బుక్ తన విధాన ప్రకటనను విడుదల చేసింది. ఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడానికి వారాల సమయం పట్టే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్బుక్ సిఈవో మార్క్ జుకర్బర్గ్ పేర్కొన్నారు.ఈ ఎన్నికలు అసాధారణమైనవి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత మనందరిపైనా ఉన్నదని ఆయన అన్నారు.
తుది ఫలితాలు రావడంలో ఆలస్యం జరగనున్నందున పౌరుల్లో దేశవ్యాప్తంగా అసహనం పెరుగుతుందన్నారు. తమ నూతన విధానం వల్ల ప్రజల్లో అయోమయానికి తావివ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయపడుతుందని జుకర్బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ విధాన ప్రకటన పట్ల పౌరసంఘాలు అభినందనలు తెలుపుతూనే అనుమానాలు వ్యక్తం చేశాయి. నూతన విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశాయి.













