తెలంగాణలో ఎలక్ట్రానిక్ పరిశ్రమకు విస్తృత అవకాశాలు : కేటీఆర్
ఎలక్ట్రానిక్ పరిశ్రమపై పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సిలికాన్ వ్యాలీలోని సాన్మినో నగరంలోని సాన్మినో కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో జ్యూరోసోలాతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సానుకూల పరిస్థితులను మంత్రి వివరించారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ పాలసీ గురించి వివరించిన మంత్రి రాష్ట్రంలో పర్యటించాలని జ్యూరో సోలాను కోరారు. ఈ సందర్భంగా మంత్రికి టై సిలికాన్వ్యాలీ చాప్టర్ గౌరవ విందు ఏర్పాటు చేసింది. సిలికాన్ వ్యాలీలోని పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నారు. టై సిలికాన్ వ్యాలీ ప్రతినిధులు రాజురెడ్డి, రాంరెడ్డి, అడోబీ కంపెనీ సీఈవో శాంతను నారాయణన్, అరుబా నెట్వర్క్ వ్వవస్థాపకుడు కీర్తి మెల్కోట్ తదితర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.













