కోవిడ్ పై జరుగుతున్న పోరాటంలో భారతీయ వైద్యులు ముందు
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలు షట్డౌన్లను ఎత్తివేసి వారి ఆర్థిక వ్యవస్థలను చక్కటి ప్రణాళికలతో పునరుద్ధరించాలి, లేకపోతే కరోనా వైరస్ కలిగించిన అర్థికనష్టం మరింత ఘోరంగా ఉంటుందని భారతీయ సంతతికి చెందిన అమెరికా వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి తెలిపారు. వైరస్‌పై ధైర్యంగా పోరాడుతూ విశిష్ట సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ సంతతికి చెందిన వైద్య సిబ్బందిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు.
అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఎఎపీఐ) అధ్యక్షుడు సురేష్‌రెడ్డి మాట్లాడుతూ యూఎస్‌లోని ప్రతి ఏడుగురి వైద్యుల్లో ఒకరైన భారతీయ వైద్యుడు కోవిడ్‌పై జరుగుతున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. సైనికుల మాదిరిగా పనిచేస్తూ వైరస్‌తో పోరాడుతున్నారని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న సోదర వైద్య బృందం ప్రస్తుతం ఆర్మీగా మారిందని సురేష్ రెడ్డి అన్నారు. వైరస్‌పై పోరాటం రెండు నెలల్లో ముగియదని కోవిడ్ 19 నియంత్రించే వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ ఏజెంట్ అభివృద్ధి అయ్యేవరకు 1 నుంచి 2 సంవత్సరాలు ఉంటుందని సురేష్ రెడ్డి తెలిపారు.













