DTA: వైభవంగా డిటిఎ దీపావళి వేడుకలు
డిట్రాయిట్లోని తెలుగువాళ్ళు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) ఆధ్వర్యంలో కాంటన్ టౌన్ షిప్ లో ఉన్న హిందూ టెంపుల్ లో 2025 దీపావళి వేడుకలను వైభవంగా ఉత్సాహభరితంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ వేడుకల్లో 40కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, 200కి పైగా స్థానిక కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు 1000 మందికి పైగా తెలుగు కుటుంబాలు హాజరై దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నాయి. ఈ వేడుకలకు డిటిఎ అధ్యక్షురాలు సుబ్రత గడ్డం, జనరల్ సెక్రటరీ రాజా తొట్టెంపూడి నేతృత్వం వహించారు.
తెలుగు సంఘ ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఈ కార్యక్రమంలో అనేక మంది కమ్యూనిటీ నేతలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిటిఎ మాజీ అధ్యక్షులు జోగేశ్వర పెద్దిబోయిన, నీలిమ మన్నే, రమణ ముదిగెంత హాజరై కార్యక్రమానికి శోభను చేకూర్చారు. అలాగే డిటిఎ మాజీ అధ్యక్షుడు మరియు ప్రస్తుత తానా ఫౌండేషన్ సభ్యుడు కిరణ్ దుగ్గిరాల, తానా జనరల్ సెక్రటరీ సునీల్ పంత్రా ప్రత్యేక అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రాయ్ తెలుగు అసోసియేషన్, డిటిఎ తెలంగాణ కమ్యూనిటీ, కేరళ కమ్యూనిటీ నాయకులతోపాటు, తానా, ఎన్నారైవిఎ, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నాయకులు కూడా పాల్గొని డిటిఎకు తమ మద్దతు తెలిపారు. ఈ సమాగమం తెలుగు సంఘాల మధ్య ఐక్యతను మరింత బలపరచిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
డిటిఎ అత్యున్నత గౌరవంగా భావించే ‘‘వడ్లమూడి వెంకటరత్నం అవార్డు’’ ను డిటిఎ మాజీ అధ్యక్షుడు మరియు తెలుగు సమాజానికి సేవలందిస్తున్న సంతోష్ అత్మకూరికి ప్రదానం చేశారు. అదేవిధంగా డిటిఎ కమ్యూనిటీ సర్వీస్ అవార్డులను రాజా దురైరాజన్, ఆనంద్ కుమార్ కు అందజేశారు. యువ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ను చంద్రవదనా కోనేరు కి ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలు తమను ఈ గౌరవానికి ఎంపిక చేసినందుకు డిటిఎ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. వేదికపై తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, నాటికలు, ఫ్యాషన్ షోలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
పిల్లల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతీ యువకులు తమ ప్రతిభతో వేదికను ప్రకాశింపజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమకు తోడ్పడిన వాలంటీర్లు, స్పాన్సర్లు, కమ్యూనిటీ నాయకులకు అధ్యక్షురాలు సుబ్రత గడ్డం, సెక్రటరీ రాజా తొట్టెంపూడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘మన తెలుగు భాష, సంస్కృతిని అమెరికా భూమిపై నిలబెట్టే ప్రతి వేడుక ఒక కొత్త శక్తిని ఇస్తుందని, ఇలాంటి సాంస్కృతిక వేడుకల ద్వారా మన యువతకు తెలుగు విలువలను చేరవేయగలుగుతున్నాం’’ అని వారు పేర్కొన్నారు. దీపావళి వేడుకలు సంతోషం, ఐక్యత, సేవా భావానికి ప్రతీకగా నిలిచి డెట్రాయిట్ తెలుగు సంఘానికి మరొక చిరస్మరణీయ ఘట్టాన్ని ఈ వేడుకలు తలపింపజేసింది.







