ముగిసిన డిటిఎ 40వ వార్షికోత్సవాలు
నోవైలోని సబర్బన్ ప్లేస్‌లో రెండు రోజుల పాటు వైభవంగా జరిగిన డెట్రాయిట్ తెలుగు సంఘం 40వ వార్సికోత్సవాలు అనూప్ రూబెన్స్ సంగీత విభావరితో ఘనంగా ముగిశాయి. వేడుకలను పురస్కరించుకుని తనను ఆహ్వానించిన డిటిఎకు ప్రముఖ సినీనటుడు నాగార్జున సందేశాన్ని పంపించి డిటిఎ చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రశంసించారు. డెట్రాయిట్లో 70వ దశకంలో తాను చదువుకున్న రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సినీనటులు గోపీచంద్, శ్రీకాంత్, చలపతిరావు, శివాజీరాజా, హరనాథ్ పొలిచెర్ల, విమలారామన్, ప్రణీత, రాజేష్, విద్యుల్లేఖ తదితరులను డీటీఏ కార్యవర్గం సన్మానించింది. గోపీచంద్, శ్రీకాంత్‌లు మాట్లాడుతూ తమకు అమెరికా అనుభూతి కన్నా భారతదేశంలోనే ఉన్నామనే భావన డిట్రాయిట్ తెలుగు సంఘం వేడుకల ద్వారా కలుగుతోందని అన్నారు. ఉదయకుమార్ చాపలమడుగును కమ్యూనిటీ సర్వీసెస్ పురస్కారంతో వేడుకల సమన్వయకర్త సాగర్ మారెంరెడ్డి ఘనంగా సత్కరించారు. యార్లగడ్డ కీలకోపన్యాసం, అమెరికా కాంగ్రెస్‌మెన్ డాన్ కిల్డీ ప్రసంగాల అనంతరం తానా కార్యవర్గాన్ని సత్కరించారు. జబర్దస్త్ జట్టు హాస్య ప్రదర్శనలు, శివారెడ్డి ధ్యన్యానుకరణ, , సినీ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. సభాస్థలి వద్ద 7వేలకు పైగా జనం కిటకిటలాడారు. సభల చైర్మన్ శ్రీనివాస్ కోనేరు, డీటీఏ అధ్యక్షుడు హర్ష అంచె, కార్యదర్శి సునీల్ పంత్ర, తానా కార్యవర్గ సభ్యులు, ఆటా కార్యవర్గ సభ్యులు, పలువురు స్థానిక ప్రవాస తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.
డిట్రాయిట్ తెలుగు సంఘం( డీటీఏ) 40వ వార్షికోత్సవాలకు మిచిగన్ రాష్ట్రం నుండి అమెరికా సెనేట్‌కు డెబ్బి స్టాబెనోవ్ తన సందేశాన్ని ప్రత్యేకంగా పంపించారు. ప్రముఖ డెమోక్రటిక్ రాజకీయవేత్త డా.అనిల్‌కుమార్ ఆమె సందేశాన్ని చదివి వినిపించారు. డిట్రాయిట్ తెలుగు సంఘానికి అమెరికా కాంగ్రెస్ గుర్తింపు పత్రాన్ని ఆయన సభల సమన్వయకర్త మారెంరెడ్డి సాగర్, చైర్మన్ కోనేరు శ్రీనివాస్, కార్యదర్శి పంత్ర సునీల్, కోశాధికారి పెద్దిబోయిన జోగేశ్వరావు, అధ్యక్షుడు అంచె హర్షలకు అందించారు.













