ఘనంగా డిటిఎ 40వ వార్షికోత్సవాలు
డిట్రాయిట్లోని తెలుగు కమ్యూనిటీ కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ నాటి నుంచి నేటి వరకు తెలుగు కమ్యూనిటీ ఎన్నో సేవలందిస్తోంది. అమెరికాలో ఏర్పడిన తొలి తెలుగు సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన డిటిఎ 2002లో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, ఇప్పుడు 40వ వార్షికోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. డిటిఎ అధ్యక్షుడు హర్ష అంచె, 40వ వార్షికోత్సవ వేడుకల కన్వీనర్ సాగర్ మారంరెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 25, 26,27 తేదీల్లో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. నోవిలోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తేదీన వినాయకచవితిని పురస్కరించుకుని వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. తరువాత జరిగిన బాంక్వెట్ విందుకు దాదాపు 3,000మందికి పైగా తెలుగువాళ్ళు హాజరయ్యారు. ఊహించని విధంగా జనాలు భారీగా రావడంతో వేడుక ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. 2,000మంది వస్తారని అంచనా వేస్తే, 3,000మంది హాజరవడంతో సంఘం నాయకులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.













