ఎన్నారైల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : శాన్ఫ్రాన్సిస్కో నూతన కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ కె. రెడ్డి
శాన్ ఫ్రాన్కిస్కో నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ)గా తెలుగువాడైన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి నియమితులయ్యారు. కేంద్రప్రభుత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డిని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
నల్గొండ జిల్లాలోని మోత్కూర్ పరిధిలో ఉన్న కొండగడప మండలంలో డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి జన్మించారు. 1996లో కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఐఎఫ్ఎస్ అధికారిగా తన బ్యాచ్‌లోనే సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీలో పని చేశారు. న్యూఢిల్లీ లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా సేవలందించారు. భారత దేశ భద్రతకు అత్యంత కీలకమైన పాకిస్తాన్ డెస్క్ ఇంచార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఐటీ, కామర్స్, స్థానిక ఎన్నారైల సమస్యలు తదితర అంశాలపై దృష్టి పెడతానని అన్నారు. ప్రవాస భారతీయులందరితో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ప్రవాస భారతీయులతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకర్ కె. రెడ్డి మాట్లాడుతూ, ఎన్నారైలకు అవసరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ముఖ్యంగా ఐటీ, కామర్స్, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఎన్నారైలందరితో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఎన్నారైలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కాగా, గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పని చేసిన డాక్టర్ టీ నాగేంద్ర ప్రసాద్ తర్వాత, మరో తెలుగు వ్యక్తి ఆ పదవిని చేపట్టడంపై తెలుగు వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఈ పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు చేపట్టడం అరుదైన రికార్డుగా చెబుతున్నారు.
అమెరికాలోని తెలుగువారి పత్రికగా ఉన్న ‘తెలుగు టైమ్స్’ ఆయన నియామకంపై హర్షం వ్యక్తం చేసింది. గతంలో కాన్సల్ జనరల్‌గా ఉన్న డాక్టర్ టి. నాగేంద్ర ప్రసాద్‌తో తెలుగు టైమ్స్ కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీకర్ కె. రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు.













