ఆకాశంలో ప్రసవం చేసిన తెలుగు డాక్టర్…శైలజా వల్లభనేని
ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన ప్రసవం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. ఆసక్తిని కలిగించింది. ప్రపంచమంతా ఈ వార్తను ఆసక్తితో తెలుసుకుంది. ఆకాశంలో ప్రసవంచేసిన డాక్టర్ శైలజా వల్లభనేని వైజాగ్ అమ్మాయి. బెంగళూరులో డాక్టర్‌గా స్థిరపడింది. ఆయన భర్త ఉదయభాస్కర్ కూడా డాక్టరే. కోలార్‌లో ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి చెన్నైలో ఫీటల్ మెడిసిన్‌లో స్పెషలైజేష్ చేసింది. గత ఎనిమిదేళ్ళ క్రితం బెంగుళూరులో ‘అరుణోదయ’ పేరుతో ఆసుపత్రిని నిర్వహిస్తూ డాక్టర్‌గా సేవలందిస్తోంది.
ఈ నెల ఏడో తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న విమానంలో జరిగిన ప్రసవం నిజంగా అబ్బురమని, ఈ అనుభవం తనకు మరచిపోలేనిదని శైలజా వల్లభనేని చెబుతున్నారు. ఆరోజు విమానంలో ఎక్కినప్పుడూ ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. విమానం టేకాఫ్ అయిన 15 నిముషాలకే మోనికా అనే గర్భిణికి నొప్పులు వస్తున్నాయని.. ఆమె చాలా కంగారుపడుతోందన్న విషయం తెలిసింది. దాంతో నేను మోనికా దగ్గరకు వెళ్లి పరీక్షించినప్పుడు ఆమె చెప్పిన తీరు తరువాత ఆమెను టాయిలెట్‌కు తీసుకువెళ్లమని క్రూకి సూచించా. వారు ఆమెను టాయిలెట్‌కు తీసుకువెళ్లారు. నాకెందుకో అనుమానం వచ్చి వెంటనే టాయిలెట్ వైపు పరిగెత్తా. తలుపు తీసి చూస్తే- అప్పటికే మోనికాకు ప్రసవం ప్రారంభమయింది. బిడ్డ తల బయటకు వస్తోంది. వేల అడుగుల ఎత్తులో ప్రసవం. నన్ను నేనే నమ్మలేకపోయా. వెంటనే ఆమెకు సాయం చేయటం మొదలుపెట్టా. క్షణాల్లో ప్రసవం జరిగిపోయింది. బిడ్డను చేతుల్లోకి తీసుకొని చూస్తే- ఇంకా పూర్తిగా ఎదగలేదని అర్థమయింది. నా చేతుల్లో పసిగుడ్డు ఒక్క సారి కెవ్వుమని అరిచింది. ‘హమ్మయ్య! ప్రసవం సక్రమంగా జరిగింది, బిడ్డ క్షేమంగా ఉంది’ అనిపించింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా.
సాధారణంగా ప్రసవం జరిగిన తర్వాత పసిగుడ్డు బొడ్డుతాడు కోసి ముడివేయాలి. కానీ విమానంలో దానికి అవసరమైన కత్తెర్లు, క్లాంపులు ఉండవు. పైగా కోవిడ్ సమయం కావటంతో శానిటైజ్ చేసిన కత్తెర్లనే వాడాలి కూడా! తప్పని సరి పరిస్థితులు కాబట్టి.. అందుబాటులో ఉన్న కత్తెరను శానిటైజ్ చేసి బొడ్డుతాడు కత్తిరించా. దానిని గాజుగుడ్డతో కట్టా! ప్రసవం అయిన వెంటనే గర్భసంచి పెద్దగా ఉంటుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఆస్పత్రిలో దీనికి అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. కానీ అవేమి లేకపోవటంతో.. చేతితోనే మోనికా పొత్తికడుపుపై మసాజ్ చేశా. అదృష్టం కొద్ది రక్తస్రావాన్ని ఆపే ఇంజెక్షన్ల సెట్లు దొరకడం. సాధారణంగా దేశీయ విమానాల్లో ఇవి అందుబాటులో ఉండవు. కానీ ఆ ఇంజెక్షన్లను ఎవరు విమానంలో ఉంచారో తెలీదు. అవి మోనికా ప్రాణాలను కాపాడాయి. మరోవైపు బిడ్డ డెలివరీ టైమ్కన్నా ముందుగానే పుట్టేశాడు.. పైగా విమానంలో పుట్టాడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు- పిల్లలను రక్షించటానికి ‘కంగారు పద్ధతి’ అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం- బిడ్డను తల్లి ఛాతి మీద పడుక్కోబెట్టి గుడ్డలు చుట్టాలి. ఇది బిడ్డకు సహజసిద్ధమైన ఇంక్యుబేటర్‌లా తోడ్పడుతుంది. బిడ్డ శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉంచడం కోసం ఈ పద్ధతిని ఉపయోగించాను. చివరకు అంతా సవ్యంగా జరగడంతో చాలా సంతోషమైందని డాక్టర్ శైలజా వల్లభనేని చెప్పారు.













