విశ్వ వైద్య విభూషణుడు…డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి
నాటా ఆధ్వర్యంలో నెల్లూరులో ఘనంగా పౌరసన్మానం…బిరుదు ప్రదానం
అమెరికాలో తెలుగువారికి, తెలుగు సంఘాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రైమ్ హెల్త్ కేర్ అధినేత, డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్‌గా, ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అడ్వయిజరీ చైర్‌గా ఉన్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి నెల్లూరులో ఘనంగా సన్మానం జరిగింది. నెల్లూరీయుడు డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డికి నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 26న నాటా ఆధ్వర్యంలో జరిగిన పౌరసన్మాన వేడుక ఆద్యంతం అంబారాన్నంటే సంబరంగా సాగింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ ప్రేమ్ రెడ్డిని చూడడంతో నెల్లూరీయుల మనసు ఆత్మీయతతో పరవశించింది. అభిమానంతో ఉరకలెత్తింది. నాటా వాళ్ల ఆధ్వర్యంలో ప్రజలంతా ఆయన్ను ఘనంగా ఆహ్వానించి చేసిన పౌరసన్మానంతో పాటు, ఎంతో విశిష్టమైన విశ్వ వైద్య విభూషణ్ బిరుదును ప్రదానం చేశారు.
నెల్లూరు జిల్లాలోని నిడిగుంటపాళెం అనే మారుమూల కుగ్రామంలో పుట్టి, అగ్రరాజ్యమైన అమెరికాలో అనేక ఆసుపత్రులు పెట్టి అపూర్వమైన వైద్య సేవలతో ప్రపంచ ప్రఖ్యాతి గడిరచిన డాక్టర్ ననమాల ప్రేమసాగర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో నెల్లూరీయులంతా కలసి ఆయనకు ఆత్మీయంగా చసిన ఘనమైన సన్మానం చరిత్రాత్మకంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి హృద్రోగ వైద్యనిపుణునిగా ఉంటూ తనదంటూ ప్రత్యేకమైన సేవాభావంతో రాణిస్తున్న డాక్టర్ ప్రేమ సాగర్ రెడ్డి అసామాన్యమైన ప్రతిభాపాటవాలను కొనియాడుతూ, ప్రపంచ వైద్య సేవారంగంలోనే ఎంతో అరుదైన ఆ మహోన్నత వైద్యునికి విశిష్టమైన విశ్వవైద్య విభూషణ్ అనే బిరుదును కూడా ఈ కార్యక్రమంలో అందజేశారు.
నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబరు 26న జరిగిన ఈ నాటా ఆటా పాటల సందడితో సన్మాన వేడుక అద్వితీయంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో రాజకీయ నాయకులు, ప్రముఖులు తరలి వచ్చారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్‌రావు, నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఎమ్మెల్సీలు టి. మాధవరావు, వాకాటి నారాయణరెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి సారధ్యం వహించిన నాటా అధ్యక్షులు కొర్శపాటి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ కేశవరామిరెడ్డి, శ్రీసిటీ ఎండీ డా.రవీంద్ర సన్నారెడ్డి, తుంగా శివప్రభాత్ రెడ్డి తదితరులంతా కలసి డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డికి, ఆయన సహధర్మచారిణి శ్రీమతి శాంతికి అపూర్వమైన రీతిలో స్వాగత సత్కార కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వేదికగా మారిన విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద నిర్వాహకులు ఒక పెద్ద క్రేన్‌ను ఏర్పాటు చేసి, భారీ గజమాలను డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి దంపతుల మెడలో వేసి స్వాగతం పలికారు. కోలాటాలు, తీన్మార్ బ్యాండ్ మేళాలు, మంగళవాద్యాలు డప్పు వాద్యాలు, కేరళ మేళాలు, ప్రజలు పెద్దఎత్తున చేసిన హర్షధాన్యాల నడుమ వందలాది మంది అభిమానులు పూలవర్షం కురిపిస్తుండగా డాక్టర్ ప్రేమ్ రెడ్డి-శాంతి దంపతులు ఎంతో వినయంగా వేదిక వద్దకు చేరుకుని అందరికీ అభివందనములు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి అమెరికాలో నిర్వహిస్తున్న వైద్యసేవలు, ఆయన సారధ్యంలో పుట్టిన ఊరికి ఏళ్ళ తరబడిగా చేస్తున్న సేవా కార్యక్రమాలతో రూపొందించిన లఘు డాక్యుమెంటరీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సన్మానపత్రంతో పాటు పాటు పౌరసన్మానం, విశ్వవైద్య విభూషణ్ బిరుదుతో డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డికి సత్కారం ఘనంగా జరిగాయి. ఈ సన్మానసభకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా, లాయర్ పత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి అతిథులను వేదికమీదకి ఆహ్వానించిన సభను నిర్వహించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా డాక్టర్ బెజవాడ నరేష్‌చంద్రారెడ్డి వందన సమర్పణ గావించారు.
చదువుకుంటేనే ఉన్నత శిఖరాలు – డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి
చదువు అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని, చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని, తానింత స్థాయికి వచ్చానంటే తన చదువే అందుకు ప్రధాన కారణమని, ఆ చదువే లేకపోతే తనకు ఏ గుర్తింపూ ఉండేది కాదని డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఈ సన్మానం సందర్భంగా చెప్పారు. విద్య`విజ్ఞానం రెండుకళ్ళుగా అందరూ బాగా చదువుకుని ఎదగాలని ఆకాంక్షించారు. నిడిగుంటపాళెం అనే కుగ్రామంలో చిన్నప్పుడు తాను ఓ చిన్న గుడ్డిదీపం వెలుగలోనే చదువుకున్నానని, బడికి వెళ్ళాలన్నా దారి సరిగా లేక పొలాల్లో బురదలో నడిచి బడికి వెళ్ళానని, ఆ బురదలో తాను వేసుకున్న స్లిప్పర్స్ ఉడిపోతే వాటిని ఆ బురదనీళ్ళతోనే కడుక్కుని వేసుకుని వెళ్ళేవాడినని, అవన్నీ తనకు గుర్తున్నాయని, అలా కష్టపడి చదువుకోవడంవల్లనే తానిప్పుడు ఇంతవాడినయ్యానని డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి వివరించారు. తమతోపాటు ఈసారి తమ కుమార్తెలు, కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం తనకెంతో ఆనందంగా ఉందని, తనకు సన్మానాలంటే పెద్దగా ఇష్టంలేదని, సన్మానాలకోసం తానిక్కడికి రాలేదని, ఒకవేళ తాను భవిష్యత్తులో నిడిగుంటపాళెంకురాలేకపోయినా, తన బిడ్డలైనా ఇక్కడికి వస్తారన్న ఆకాంక్షంతో తన పుట్టినపూరికి వీళ్ళందరినీ తీసుకువచ్చానని ఆయన చెప్పడంతో సభికులంతా పెద్దఎత్తున హర్షధాన్యాలు వ్యక్తం చేశారు. జన్మభూమిపై ఆయనకున్న మమకారానికి పులకించిపోయారు. అనంతరం తనకు చిన్నతనంలో పాఠాలు చెప్పిన నిడిగుంటపాళెం హైస్కూల్ ప్రదానోపాధ్యాయులు గోపాలయ్య దంపతులకు డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి దంపతులు శాలువతో సన్మానించి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డిని అనేకమంది ప్రముఖలు సన్మానించారు.
నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ, డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న సేవలను కొనియాడారు. నాటా తరపున తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవే డేస్ పేరుతో పలు కార్యక్రమాలను చేసినట్లు తెలియజేశారు. డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డికి పుట్టినగడ్డ అయిన నెల్లూరులో ఇంతకాలంగా పౌరసన్మానం జరగలేదే అనే బాధ మనుసులో చాలాకాలంగా ఉండేదని, ఇప్పుడు ఆ కొరత తీరిందన్నారు. డాక్టర్ ప్రేమన్నకు పౌరసన్మానం జరగడం. ఇది కూడా నాటా సేవాడేస్‌లో భాగంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంచెలంచెలుగా ఎదిగి మాతృభూమికిఅండగా నిలిచిన ప్రేమ్‌సాగర్‌రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. విదేశాల్లోనూ తెలుగు వారి ఐక్యతకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేమ్‌సాగర్‌రెడ్డి యువతకు ఆదర్శమైన వ్యక్తి అని కొనియాడారు.
శ్రీసిటీ ఎం.డీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి అమెరికా వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చాలా కాలానికి మనదేశానికి వస్తున్నారని తెలియగానే నాకెంతో సంతోషం కలిగింది. తన సొంతపూరిని సందర్శించుకోవడానికి వారు ఇక్కడకు రావడం నిజంగా ఇదొక శుభదినం. ఈ సందర్బంగా ఆయన్ను మనం సన్మానించుకోవడం ఒక అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు కూడా ప్రసంగించారు. నాటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ అలరించాయి.













