అందరూ జాగ్రత్తగా ఉండాలి – డా. ప్రేమ్‌సాగర్ రెడ్డి
అమెరికాలో తెలుగువారికి సుపరిచితులు ప్రైమ్ హెల్త్ సర్వీసెస్ పేరిట అనేక హాస్పిటల్స్ నడిపే డా. ప్రేమ్‌సాగర్ రెడ్డి తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ, కరోనా వైరస్ విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడే కరోనా నుంచి దూరమవ్వచ్చని చెప్పారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజెలిస్‌లో ఉండే డా. ప్రేమ్‌రెడ్డి తెలుగువారికి ఎంతో ముఖ్యులు కూడా. కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాలలోనే మొదటగా కరోనా వచ్చిందని, కాలిఫోర్నియా రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న చైనీయులు జనవరి, ఫిబ్రవరి నెలలో చైనాకు వెళ్ళి వచ్చారని, కరోనా వైరస్ వచ్చిన తరువాత కూడా కాలిఫోర్నియా రాష్ట్రం దానిని బాగానే కట్టడి చేసిందని చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు బాగా పనిచేశాయని తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్రం కన్నా ఇక్కడి కమ్యూనిటీ చూపించిన నిబద్దత వలననే కరోనాను కట్టడి చేయగలిగారన్నారు. ఇలాగే అందరూ అవగాహనతో, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం ఉండదని చెప్పారు. కరోనా బారిన పడినవారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి, భారతీయ స్టూడెంట్లకు అన్నీవిధాలా సహాయం చేస్తున్న తెలుగు సంఘాలను ఈ సమయంలో ప్రత్యేకంగా అభినందించాలని ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు.






