ట్రంప్ సంచలన నిర్ణయం – అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రద్దు
కరోనా వైరస్‌తో అతలాకతులమైన అమెరికాను గట్టెక్కించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 20వ తేదీన అమెరికాలో తాత్కాలికంగా అన్నీరకాల వీసాలజారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులపై సంతకం పెట్టి విడుదల చేయనున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన అమెరికాలో ఉన్న వివిధ దేశాల వారిని, అమెరికాలో వివిధ వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్న అనేక ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో ఇప్పటికే దాదాపు 22 మిలియన్ (2.2 కోట్లు) మంది నిరుద్యోగులుగా లెక్కతేలారు. ఆ లెక్క ఇంకా పెరుగుతుందని అన్నీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలు, వారి క్షేమంకోసం, వారి ఉద్యోగ భద్రతకోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రిపబ్లికన్ పార్టీకి చెందిన జెఫ్ సెషన్స్ అనే నాయకుడు 18 ఏప్రిల్ నాడే కొన్నాళ్ళు అమెరికాలో అన్నీరకాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తే బావుంటుందని అభిప్రాయం వెల్లడించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రతి సంవత్సరం అమెరికాకు దాదాపు 1.4 మిలియన్ (అంటే 14 లక్షలు) మంది వివిధ రకాల వీసాలతో అమెరికాకు వచ్చి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అవి కొన్నాళ్ళు ఆపివేయాలని ఆయన తన అభిప్రాయం తెలిపారు. హెచ్1బి వీసాను కూడా ఆపివేయాలని ఆయన సూచించారు. అయితే ఫెడరల్ ప్రభుత్వం ఈ విధంగా ఒక అధికారిక ప్రకటన ద్వారా వీసాలను ఆపగలదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆర్డర్స్ వెలువడిన వెంటనే ఈ ఉత్తర్వులపై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతక్రితం కూడా ముస్లిం దేశాల నుంచి వలసలు ఆపుదామని్ర ప్ ప్రభుత్వం ప్రకటించిందని, దానిని కోర్టులో సవాల్ చేయడం జరిగిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే పూర్తిగా వలసలు ఆపివేయలేకపోయినా, నిబంధనలు పేరుతో ప్రతి అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసినా చేయగలిగేది ఏమీ లేదని కూడా పరిశీలకులు అంటున్నారు.
వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ప్రభుత్వ అటార్నీ జనేత కంచర్ల దీనిపై స్పందిస్తూ ట్రంప్ ప్రకటన చూశామని, పూర్తిస్థాయి ఆర్డినెన్స్ బయటకు వచ్చాకగాని, దాని పూర్వాపరాలు అర్థం అవుతాయని, అప్పటివరకు ఎలాంటి ఊహగానాలు చేయడం అనవసరమని చెప్పారు.
ఏదీ ఏమైనా ఈ ఉత్తర్వులు అధికారికంగా వెలువడితే భారత్ లాంటి దేశాలకు ఎంతో నష్టమని కొందరు అంటున్నారు.













