మీ మేలు కోరి చెబుతున్నాం ఇకనైనా మారండి
ఉగ్రవాదులకు సాయపడడాన్ని పాకిస్తాన్ ఇప్పటికైనా వదిలివేయాలని అమెరికా కోరింది. పాక్ మేలు కోరి ఈ మాటలు చెబుతున్నామని, ప్రపంచ శాంతి విఘాతానికి కారణమవుతున్న ఉగ్ర మూలాలు ఎక్కడ ఉన్నాయని తెలిసినా ఉపేక్షించబోమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ సృష్టం చేశారు. ఇకనైనా పాక్ మారాలని హితవు పలికారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖావాజా ఆసిఫ్‌తో సమావేమైన అనంతరం టిల్లర్సన్ మీడియాతో మాట్లాడారు. తాను ఖావాజాతో సమావేశానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానని, ఆయన నోటి నుంచి ఉగ్ర నిరోధక చర్యల గురించిన మాటలు వస్తాయని భావించానని, కానీ ఖావాజా ఆ ప్రస్తావనే తేలేదని టిల్లర్సన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పాక్ వైఖరి మారుతుందని ఎంతో ఓర్పుతో వేచి చూస్తోందని, అలా కుదరదని భావిస్తే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్లో సైన్యం, ప్రజా ప్రతినిధుల మధ్య అంతరం పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పాకిస్తాన్‌తో తాము మంచి స్నేహబంధాన్నే కోరుతున్నామని, అయితే, ఒ ఉగ్రవాది కూడా తమ భూభాగంపై లేకుండా చూడాల్సిన బాధ్యత పాక్‌దేనని అన్నారు.













