భారత్ కు తేల్చి చెప్పిన అమెరికా
కొన్ని వస్తువుల దిగుమతిలో భారత్కు ఇస్తున్న సుంకాల మినహాయింపు ఇక కుదరదని అమెరికా తేల్చి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులకు, అమెరికా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) పేరుతో దిగుమతి సుంకాల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తుంది. ఈ విధానం వల్ల భారత్ ఎక్కువగా లబ్ది పొందుతోంది. 2017లో జీఎస్పీ కింద భారత్ నుంచి అమెరికాకు ఎలాంటి సుంకాలు లేకుండా 570 కోట్ల డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతయ్యాయి. సమాచారాన్ని (డేటా) స్థానికంగానే నిల్వ చేయాలన్న నిబంధనకుతోడు భారత్ మార్కెట్లో తమ కంపెనీలకు సమాన వ్యాపార అవకాశాలు లేవని, అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది. ఇందుకు నిరసనగా భారత ఉత్పత్తులకు జీఎస్పి కింద ఇస్తున్న మినహాయింపును రద్దు చేస్తున్నట్టు మార్చి 4న ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇందుకు 60 రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ గడువు మే 3న ముగిసింది.













