డబ్ల్యూహెచ్వో కు అమెరికా గుడ్ బై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నుంచి వైదొలుగుతామని ఇప్పటికే హెచ్చరించిన ఆయన ఆ దిశగా అధికారికంగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి అమెరికా అధికారికంగా సమాచారం అందించింది. ఈ నెల 6న తమకు లేఖ అందిందని ఐరాస వర్గాలు తెలిపాయి. డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వైదొలగడానికి ఒక సంవత్సరం ముందుగా సమాచారం ఇవ్వాలి. అంటే.. వచ్చే ఏడాది జులై ఆరు తర్వాత అమెరికా సభ్యత్వం రద్దువుతుంది. చైనాలోని వుహాన్ నగరంలో ఆరంభమైన కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచాన్ని డబ్ల్యూహెచ్వో తప్పుదోవ పట్టించిందని, చైనాకు కొమ్ముకాసిందని కొన్ని నెలలుగా అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఏప్రిల్లో ఆ సంస్థలకు నిధుల విడుదలను కూడా ఆపేసింది.













