టీచర్లు కూడా తుపాకీని వాడితే…
తుపాకీలను వాడటంలో అనుభవమున్న టీచర్ (సాయుధ టీచర్) ఉంటే పాఠశాలల్లో కాల్పులకు పాల్పడే వారిని అడ్డుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పెరిగిపోతున్న తుపాకి సంస్కృతిపై ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక పాఠశాలలో 17 ఏళ్ల నికోలస్ క్రూజ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో తుపాకీ సంస్కృతిని వ్యతిరేకిస్తూ, వాషింగ్టన్, చికాగో, పిట్స్బర్గ్ నగరాల్లో వందలాది మంది భారీ స్థాయిలో నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆయన సుమారు గంట పాటు ఉద్వేగభరితంగా మాట్లాడారు. 20 శాతం మంది టీచర్లు తుపాకీలు ఉపయోగించటం నేర్చుకుంటే ఇలాంటి కాల్పుల ఘటనలను అడ్డుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) సూచించిన విధంగా తుపాకీల కొనుగోలుదారుల విషయంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. కొన్ని రకాల తుపాకీల కొనుగోలుకు వయసు పెంపును కూడా పరిశీలిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ నిర్ణయానికి కొందరు మద్దతు తెలపగా మరికొంత మంది వ్యతిరేకించారు.













