దీపావళి వేడుకల్లో ట్రంప్ ప్రసంగం.. భారత్ అంటే ఎంతో అభిమానమని మళ్లీ చెప్పిన మాజీ అధ్యక్షుడు
తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలు తన నివాసంలో నిర్వహించినందుకు రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) నాయకులు శలభ్ కుమార్, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్, సతీశ్ వేమనలను ట్రంప్ అభినందించారు. 2016 ఎన్నికల్లో ఆర్‌హెచ్‌సీ సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు.
2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోఅలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్టిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులకు పరిపాలనలో భాగం చేస్తానని, అలాగే షల్లీ కుమార్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తానని ఆమీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు.
పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’ అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు.













