హెచ్-1బీపై నోరు మెదపని ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఇమిగ్రేషన్ విధాన ప్రణాళికను కాంగ్రెస్‌కు పంపించారు. అధికారులు కఠినంగా అమలు చేయాల్సిన 70 అంశాలను అందులో ప్రతిపాదించారు. అయితే హెచ్-1బీ వీసాలపై ఆయన నోరు విప్పకపోవడం గమనార్హం. ట్రంప్ వైట్‌హౌస్‌లో ఆవిష్కరించిన ప్రణాళికను ప్రతిభా ఆధారిత వలస విధానం అంటున్న సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాలో ఉంటున్న విదేశీయుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాసహోదా కల్పిస్తారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, తల్లిదండ్రులను అనుమతించరు. సమానత్వం, ఆర్థిక విజయం సాధించేందుక విద్య, ఉద్యోగ అర్హత, ఇంగ్లీష్ సృష్టంగా మాట్లాడే నేర్పు అంశాల ఆధారంగా గ్రీన్‌కార్డులు ఇవ్వడమే ప్రతిభ ఆధారిత వ్యవస్థ అని వైట్‌హౌస్ పేర్కొంది.
ప్రతిభ ఆధారిత వలస విధానం భారతీయులకు ప్రయోజనకరం అని కొందరు వాదిస్తుండగా మరి కొందరు కాదంటున్నారు. ఏడాదికి ఒక దేశానికి 20వేల గ్రీన్ కార్డులు మాత్రమే పరిమితం చేస్తే భారత్‌కు ప్రయోజనకరం అంటున్నారు. ఇప్పటికే అర్హతగల భారతీయులు, వృత్తి నిపుణులు 11 ఏళ్లుగా గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానం వస్తే ఈ ఎదురు చూపులు తప్పిపోతాయని త్వరగా గ్రీన్ కార్డు పొందవచ్చని అంటున్నారు.













