నాడు సానుకూలం… నేడు కఠినం
హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకుంటూ వచ్చారా? దీనికి సమాధానం అవుననే వస్తోంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడినపుడు ట్రంప్- అమెరికా ఫస్ట్- నినాదాన్ని బలంగా వినిపించారు. కానీ ఎన్నికలు ముగిశాక హెచ్1 బీ వీసాల విషయంలో ఆయన సానుకూలత ప్రదర్శించారు. కానీ కొద్ది నెలల్లోనే ఆ వైఖరి మార్చేసి – బై అమెరికన్- హైర్ అమెరికన్ అనే ఆదేశాలిచ్చారు. ఐటీ పరిశ్రమకు సాయం అందించాల్సిందే. హెచ్1బీ వీసాల అవసరమెంతో ఉందని ఎన్నికల ముగిశాక ట్రంప్ మీడియా మొఘల్ రూపర్డ్ మర్డాక్తో ఫోన్లో అన్నారు అని మైఖేల్ వోల్ప్ అనే జర్నలిస్టు తన పుస్తకం- ఫైర్ అండ్ ఫ్యూరీ ఇన్సైడ్ ది ట్రంప్ వైట్‌హౌస్‌లో పేర్కొన్నారు. ఆనాడు సానుభూతిగా మాట్లాడిన ట్రంప్ ఇపుడు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని రచయిత వ్యాఖ్యానించారు.













