వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటీ దురుసుతనం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన గురువారం చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ఆయన సొంత పాలకవర్గంలోని ఉన్నతాధికారులు సైతం దీనిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అది కేవలం వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక ట్రంప్‌పై గుర్రుగా ఉండే అక్కడి కొన్ని మీడియా ఛానళ్లు దీన్ని పతాక వార్తగా ప్రచురించాయి. కరోనా వైరస్‌ను చంపడానికి క్రిమినాశక రసాయనాలు (డిసిన్ఫెక్టెంట్)లను రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ ట్రంప్ ఓ ప్రమాదకర సూచన చేసిన విషయం తెలిసిందే. అతినీలలోహిత (యూవీ) కాంతిని చొప్పించాలని కూడా సలహా ఇచ్చారు. దీనిపై అమెరికా ఆరోగ్య నిపుణులు మండిపడ్డారు.













