హిల్లరీ క్లింటన్‌పై మండిపడ్డ ట్రంప్
అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. రష్యాతో తనకు సంబంధాలున్నాయనే ఆరోపణలపై దర్యాప్తు జరిపి పూర్తి సమాచారం సేకరించేందుకు హిల్లరీ క్లింటన్ ప్రచాక కమిటీ, డెమోక్రటిక్ పార్టీలు కూడా కొంత సొమ్ము చెల్లించాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ మండిపడ్డారు. ఇది చాలా అగౌరవమైన విషయం, ఈ దేశంలో రాజకీయాలపై ఇదొక విషాదకర వ్యాఖ్య అని వైట్‌హౌస్‌లో విలేకర్లతో అన్నారు. అదొక బూటకమని పత్రమని, కల్పితమైన వార్తలతో రూపొందించడానికి వారు చాలా సొమ్ము చెల్లించారని ట్రంప్ విమర్శించారు. తమకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని హిల్లరీ, డెమోక్రాట్లు చెబుతూ వచ్చారని, కానీ ఇప్పుడు కోర్టు కేసు సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో డెమోక్రాట్లకు ఇదొక సాకుగా ఉపయోగపడిందని, ఓటమికి ఏం చెప్పాలో తెలియక ఈ రష్యా బూటపు కథనం అల్లారని ట్రంప్ పేర్కొన్నారు.













