డొనాల్డ్ ట్రంప్ కు కరోనా చికిత్స పూర్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ వైద్యులు సియాన్ కాన్లే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌నకు అందించాల్సిన చికిత్స పూర్తి అయిందనీ, ఆయన ప్రజల ముందుకు వచ్చినా పర్వాలేదని తెలిపారు. గత శుక్రవారం నుంచే ఆయనలో ఎటువంటి కరోనా మహమ్మారి లక్షణాలు లేవనీ, వైట్‌హౌస్ చేరుకున్నప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. ఆయనకు అందించిన చికిత్సకు బాగా స్పందించారనీ, అందించిన ఔషధాల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌నకు కరోనా సోకడంతో ఆయన ప్రచార కార్యక్రమాలపై ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే, ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 15న ట్రంప్, బైడ్న్ల మధ్య డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ భేటీలో పాల్గొంటానని ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.













