రానున్న రెండు వారాలు గడ్డు పరిస్థితే : ట్రంప్
రానున్న రెండు వారాలూ అత్యంత కఠినమైనవనీ, చాలా చాలా బాధాకరం కానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ తీవ్రమైన స్థితిని ఎదుర్కొనడానికి మానసికంగా సిద్ధంకావాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది మామూలు ప్లూ కాదు. అనేక రెట్లు ఎక్కువ విషపూరితమైనది. ఈ వైరస్ ప్రాణాంతకం, వినాశకరం అన్నారు. ఎన్నడూ ఎరుగని రీతిలో మనం ఓ వైరస్‌తో యుద్ధంలో ఉన్నాం. కలిసికట్టుగా, ప్రేమతో, అంకితభావంతో ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా పోరాడాలి. అపుడే విజయం సాధించగలం అని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. వైరస్ వల్ల అమెరికాలో కనీసం 2 లక్షలమంది చనిపోవచ్చని శ్వేతసౌధం అంచనా వేసింది.













