భారతీయ ఐటి నిపుణులకు మరో షాక్
ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్-1బీ వీసా జారీ నిబంధనలు మార్చాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ట్రంప్ సర్కారు, భారతీయ ఐటీ నిపుణులకు ఊహించని షాకిచ్చింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాలయిన హెచ్-1బీ, ఎల్ 1 వీసాల పొడిగింపునకు నిబంధనలను కఠినం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్పుడో పదమూడేళ్ల క్రితం రూపొందించిన వీసా పొడిగింపు చట్టంలో లోపాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అవసరం అని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తేల్చి చెప్పింది. గతంలో ఉన్న చట్టం ప్రకారం హెచ్-1బీ వీసా పొందిన వ్యక్తి, వీసా పొడిగింపునకు అర్హుడే. వీసా పొడిగింపు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉండేది. దరఖాస్తు చేయగానే ఆమోద ముద్రపడేది. ప్రస్తుతం మార్పులు చేసిన నిబంధనల ప్రకారం వీసా పొడిగింపు అంత సులభం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా హెచ్-1బీ వీసాకు అతడు అర్హుడా కాదా? అన్నది పరిశీలిస్తారు. హెచ్-1బీ లేదా ఎల్ 1 వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికి అభ్యర్థికి అర్హతలు ఉన్నాయా అన్నది పరిగణనలోకి తీసుకుంటారు. అమెరికా ఉద్యోగిని విదేశీ ఉద్యోగితో భర్తీ చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు ఈ విధానాలను పరిశీలకులు భావిస్తున్నారు. ట్రంప్ సర్కారు తెచ్చిన మార్పులతో భారతీయ ఐటీ నిపుణులు భారీగా నష్టపోతారని తేల్చి చెబుతున్నారు.













