ట్రంప్ సమాజానికి ఓ పెను ముప్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాజానికి ఓ పెను ముప్పుగా ప్రముఖ రచయిత్రి, మోడల్, టీవీ వ్యాఖ్యాత పద్మాలక్ష్మి అభివర్ణించారు. ట్రంప్ తన పదవి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని అమె పేర్కొన్నారు. ఆయన మన సమాజానికే పెను ముప్పు అని అనుకుంటున్నాను. అత్యంత గౌరవప్రదమైన ఆ పదవి పరువును దిగజార్చకుండా చూసేందుకు ఆయనను నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నించాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి మౌలిక హుందాతనానికే ట్రంప్ ఓ ప్లేగు వ్యాధిలా పరిణమించారన్నారు. తనకు తెలిసినంతవరకూ ఆయనకు సిద్ధాంతాలంటూ ఏమీ లేవన్నారు. కేవలం డొనాల్డ్ ట్రంప్ సిద్ధాంతం ఒక్కేటే తెలుసాయనకు, అది అత్యంత ఆపాయకరమైనది అంటూ వ్యాఖ్యానించారు. పద్మాలక్ష్మి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరపున ప్రచారం చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇక్కడ నిర్వహిస్తున్న సాహితీ ఉత్సవంలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.













