అధ్యక్ష ప్రచారంలోకి దిగిన ట్రంప్
మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడమే లక్ష్యంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో జరుగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు సమర శంఖం పూరించారు. కీప్ అమెరికా గ్రేట్ అన్న నినాదంతో ట్రంప్ ప్రచారం ప్రారంభించారు. ఫ్లోరిడాలో తన ప్రచారాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. వేల మంది మద్దతుదారుల సమక్షంలో సుమారు 80 నిమిషాల పాటు ప్రసంగించారు. తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని, దేశం కోసం రూపొందించిన అభివద్ధి ఎజెండాను పూర్తిచేయడానికి తనకు మరో నాలుగేండ్ల సమయం ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించడానికి ఈ రోజు నేను మీ ముందుకొచ్చాను. విదేశాల ముందు అమెరికాను ఎప్పుడూ తలదించుకునేలా చేయనని ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.
మా హయాంలో దేశ ఆర్థిక స్థితిగతులను చూసి ప్రపంచమే అసూయ పడుతున్న ది. మనం ముందుకు వెళ్దాం. పోరాడుదాం. విజేతలవుదాం అని పేర్కొన్నారు. తన గెలుపుతో మూడేళ్ళ క్రితం అమెరికా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని, అమెరికా ఫస్ట్ (తొలి ప్రాధాన్యం అమెరికన్లకే) అన్న విధానం అవలంబించామని తెలిపారు. తన హయాం లో దేశం పురోగమించిందని, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించకుంటే పరిస్థితి ఇబ్బంది మారుతుందని హెచ్చరించారు.













