క్యాన్సర్ చిక్సితలో మరో సంచలనం!
క్యాన్సర్ చికిత్సలో మరో సంచనలం. ఈ వ్యాధి కణాలను మెరిసేలా చేసి, వాటి జాడను పసిగట్టే సరికొత్త ఫ్లోరోసెంట్ రంగులను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనికి భారత సంతతికి చెందిన డా.సునీల్ సింఘాల్ నేతృత్వం వహించడం విశేషం. చాలా రకాల క్యాన్సర్లకు ఓ దశ దాటిన తర్వాత శస్త్రచికిత్స తప్పదు. క్యాన్సర్ కణాలన్నింటినీ తొలగించామని వైద్యులు సంతృప్తి చెందినా, కొద్దికాలం తర్వాత చాలామందిలో మళ్లీ వ్యాధి తిరగబడుతోంది. కొన్ని క్యాన్సర్ కణాలు పరీక్షలకు చిక్కకుండా శరీరంలో తప్పించుకుని తిరగమే ఇందుకు కారణం. అయితే, వైద్య అవసరాల నిమిత్తం విరివిగా వాడే ఇండోసియానైన్ (ఐసీజీ) రంగును ఉపయోగించి, ఈ కణాలను మెరిసేలా చేయడంపై సింఘాల్ దృష్టి సారించారు. శస్త్రచికిత్సకు ముందురోజు న్యూజెర్సీకి చెందిన ఓ రోగి శరీరంలోకి ఐసీజీని అధికమోతాదులో ఎక్కించారు. తర్వాత ఆయణ్ను శస్త్రచికిత్స గదిలో పరారుణకిరణాల కింద ఉంచగా, శరీరంలో వివిధ భాగాల్లో నక్కిన క్యాన్సర్ కణాలన్నీ మెరవటం ప్రారంభించాయి. దీంతో వాటన్నింటీని తొలగించారు. ఈ వర్ణంతో ఉపిరితిత్తలు, రొమ్ము, మెదడు క్యాన్సర్లను మళ్లీమళ్లీ రాకుండా నియంత్రించే అవకాశముందని సింఘాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.













