అమెరికా వెళ్తూ గుర్తుగా తీసుకెళ్లిన కేథరిన్ హడ్డా
హైదరాబాద్ నగరం నుంచి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ మాజీ జనరల్ క్యాథరిన్ హడ్డా తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా ఆమె పదవీకాలం ముగియడంతో తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు. ఇక్కడి ప్రజల గుర్తుగా పలు వస్తువులను పదిలంగా దాచుకున్నారు. లోహంతో తయారు చేసిన చార్మినార్ ప్రతిమ, ఉస్మానియా బిస్కెట్లు, అరకులోయలో తీసుకున్న కాఫీ ఫౌడర్, ఒడిసా గిరిజనులు తయారు చేసిన కళాఖండం, కోణ్కార్క్ దేవాలయం ప్రతిమ, కొండపల్లి ఏనుగు బొమ్మ, కాకతీయ గుడి చిత్రపటాలతో పాటు…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ బహుకరించిన తెలంగాణ చేనేత చీరెను కట్టుకున్న ఫొటోను క్యాథరిన్ హడ్డా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేటీఆర్, జయేశ్‌రంజన్ తనకు అద్భుతమైన చీరెను బహుకరించారని, తాను కట్టుకున్న చీరెపై తన చిత్రం కూడా ముద్రించి ఉన్నదని అందులో పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ ఒడిసా రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన బహుమతులను ఇక్కడి ప్రజల గుర్తుగా తనతో తీసుకెళుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.













