డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు… హాజరైన సతీష్ వేమన, జగదీశ్ ప్రభల
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగో లో, (ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు జగదీశ్ ప్రభల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ట్రంప్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌబ్రాత్రుత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం మరియు అమెరికా దౌత్య సంబంధాలు, పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని, అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని, శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంబించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను వేరిపారేస్తామని తెలిపారు.
భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ.. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు మరియు దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు..అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని.. వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది.. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు.
కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. ఇలా వచ్చిన వారిలో కేవలం ఇద్దరు తెలుగు వారికి మాత్రమే ట్రంప్‌తో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం గమనార్హం. వారిలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, జగదీశ్ ప్రభల కూడా ఉన్నారు.
భారత్ అంటే ఎంతో అభిమానమన్న ట్రంప్
తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు. 2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోఅలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్టిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులను పరిపాలనలో భాగం చేస్తానని, అలాగే షల్లీ కుమార్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తానని హామీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు.
పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’ అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు.
సతీష్ వేమన ధన్యవాదాలు…
దేశం కానీ దేశంలో కూడా తమ మూలాలను కాపాడుకుంటూ, తమ వారికి ఏ చిన్న ఆపద వచ్చిన సంయుక్తంగా, భాష ప్రాతిపదిక సంఘాలుగా ఏర్పడి కూడా తమ వారి కష్ట నష్టాల్లో అండగా నిలుస్తూ, ఆదర్శంగా సాగుతున్న పలు ప్రవాస సంఘాల సారధులను సమన్వయము చేస్తూ ఈ దీపావళి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రిపబ్లికన్ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్‌ను, కార్యవర్గ సబ్భ్యులను తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ప్రత్యేకంగా అభినందిస్తూ, ధన్యవాదములు తెలిపారు. ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.













