TTA: జన్మభూమికి మోహన్ రెడ్డి పాటలోళ్ళ సేవ… 110 మందికి కృతిమ అవయవాల పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA)లో ప్రముఖులైన మోహన్ పాటలోళ్ళ(Mohan Patlolla) జన్మభూమిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, తన సేవాతత్పరతను చాటుకుంటున్నారు. టీటీఏ తరపున నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం నెమ్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో 110 మందికి కృత్రిమ అవయవాలు, 60 మందికి ట్రై సైకిల్, 8 వీల్చైర్లు, 1 వాకర్ మరియు 10 చేతి కర్రలను పంపిణీ చేశారు. ఇంతమందికి సేవ చేసే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని మోహన్ పాటలోళ్ళ చెప్పారు.
తెలంగాణలోని నా జన్మస్థలంలో కమ్యూనిటికీ నావంతుగా సేవలందిస్తున్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ సేవల ద్వారా సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది సేవ చేయాలన్న అభిలాషను ఆయన వ్యక్తం చేశారు. తాను నెమిలి గ్రామంలో జన్మించినప్పటికీ అమెరికాలో ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో టిటిఎ ద్వారా వివిధ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో షిరిడీ సాయిబాబా ఆలయం ఏర్పాటు చేశానని, అలాగే ఆస్పత్రి, బస్టాండ్ల ఏర్పాటుకు సహాయం అందించినట్లు చెప్పారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వారికి ఆసరగా నిలుస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరింతమందికి కూడా ట్రై సైకిళ్ళను, వీల్ చైర్లను టిటిఎ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు మోహన్ పాటలోళ్ళ అమెరికాలో స్థిరపడినప్పటికీ గ్రామంలోని పేద ప్రజల గురించి, జిల్లా ప్రజలకు ఏమైనా చేయాలన్న తలంపుతో కార్యక్రమాలను చేస్తున్నారని ఆయన జన్మభూమికి చేస్తున్న సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి టిటిఎ అడ్వయిజరీ ఛైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, అధ్యక్షుడు-ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెడ్డి మరియు ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాథ రెడ్డి హాజరయ్యారు. టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారికి, ఏసీ సభ్యుడు భరత్ రెడ్డి మాదిరి, అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ఈసీ, బీఓడీల మద్దతుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి, రంగారావు (రొటరీ క్లబ్ నుండి సేవా భాగస్వామి)కి టిటిఎ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.







