TANA: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు ‘తానా ఎన్టీఆర్ అవార్డు’
తానా 24వ కాన్ఫరెన్స్ (TANA 24th Conference) రెండో రోజు కూడా ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారెని తానా గౌరవించింది. తెలుగు చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తిస్తూ.. తానా ఎన్టీఆర్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. ఈ సందర్భంగా 1975లో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బాబు’తో ఆయన సినీప్రస్థానం ఎలా మొదలైందీ గుర్తుచేసుకున్నారు. వందకుపైగా చిత్రాలతో ఎంతోమంది కొత్త నటీనటులను తెలుగు చిత్రపరిశ్రమకు అందించారు. భక్తి చిత్రాలతో కూడా కమర్షియల్ సక్సెస్ సాధించిన అతికొద్ది మందిలో రాఘవేంద్ర రావు ఒకరు. తెలుగు సినిమా గర్వించే స్థాయికి ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి కూడా రాఘవేంద్ర రావు శిష్యుడే. అలాంటి వ్యక్తిని 24వ తానా కాన్ఫరెన్స్‌లో సత్కరించడం ఎంతో గౌరవంగా తానా భావించింది.
తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, సెక్రటరీ రాజా విస్కుర్తి, ట్రెజరర్ భరత్, తానా మాజీ ప్రెసిడెంట్లు హనుమయ్య బండ్ల, తోటకూర ప్రసాద్, కోమటి జయరాం, అంజయ్యచౌదరి లావుతోపాటు కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయకుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల, ముఖ్యఅతిథి రఘురామకృష్ణం రాజు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నటులు మురళీ మోహన్, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యేర్నేని, హీరో నిఖిల్, ఐశ్వర్యా రాజేష్, డైరెక్టర్ వీరభద్రం చౌదరి, డాక్టర్ కేవీ ప్రసాద్ తదితరులంతా కలిసి రాఘవేంద్రరావు గారికి వేదికపై సన్మానం చేశారు. ఈ సందర్భంగా తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌ను రాఘవేంద్ర రావు గుర్తుచేసుకున్నారు. తనకు ఈ అవార్డు అందించిన తానాకు ధన్యవాదాలు తెలిపారు.







