సాంకేతిక పరిజ్ఞానం నేడు అవసరం – జయరామ్ కోమటి
నేడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని, ప్రాథమిక స్థాయి నుండే దీనిపౖౖె పట్టు సాధించాలని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి అన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవాసాంధ్రులు మాదల విజయకృష్ణ అందించిన డిజిటల్ క్లాస్ పరికరాలను బయాలాజికల్ ల్యాబ్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పని చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత అబివృద్ధి పరిచేందుకు డిజిటల్ క్లాస్‌లను నిర్వహించేందుకు సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
మాదల విజయకృష్ణ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ నూతన పుంతలు తొక్కుతోందన్నారు. ఈ పరిజ్ఞానం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా తెలుసుకోవాలన్నారు. పాఠశాల హెచ్ఎం సురేష్‌కుమార్ మాట్లాడుతూ దాతలు, ఎన్ఆర్ఐల సహకారంతో పాఠశాల అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. ఇప్పటికే పాఠశాలలో 3 డిజిటల్ తరగతి గదులు దాతల సహకారంతో ఏర్పాటయ్యాయని, మరో 4 డిజిటల్ తరగతుల ఏర్పాటుకు దాతలు ముందుకురావడం శుభపరిణామమన్నారు. అనంతరం జయరామ్ కోమటి, దాత మాదల విజయకృష్ణ కుటుంబ సభ్యులను పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎమ్సీ కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచినేని వెంకటరత్నం చారిటీస్ అధ్యక్షుడు మంచినేని పరమేష్, వ్యాపారవేత్త ముత్తవరపు మురళీకృష్ణ, పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ కేఎస్ వరప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ విద్య, ఎస్ఎంసీ కో ఆప్షన్ సభ్యులు వేములపల్లి ఉమామహేశ్వరరావు (బోను) ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.













