చైనాయే నేడు అమెరికాకు దిక్కు
ముందుచూపులేని ట్రంప్ వైఖరితో నష్టపోయిన అమెరికా
అమెరికాలాంటి అగ్రరాజ్యానికి నేడు సహాయం కావాల్సి వచ్చింది. దానికితోడు నిన్నటివరకు చెడామడా తిట్టిన దేశాన్ని కరుణించవమ్మా అని అడగాల్సి వచ్చింది. అమెరికాలో కోవిడ్ 19 వైరస్ విజృంభణతో అమెరికా వైద్యులు, ఆస్పత్రులు పరికరాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. తగిన వైద్యం లేక అమెరికన్లు ప్రాణాలను కోల్పోతుండటంతో ట్రంప్ ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వైద్య పరికరాలకోసం, మందులకోసం ఇతర దేశాలను అడుక్కోవలసి వచ్చింది. నిన్నటివరకు తిట్టిన తిట్టు తిట్టిన చైనాను నేడు నువ్వే మాకు దిక్కు అంటూ చైనాను పరికరాలు సరఫరా చేయాల్సిందిగా కోరింది.
అమెరికాను అప్రతిష్టపాలు చేస్తున్నదనీ, మానవ హక్కులు కాలరాస్తున్నదని, నియంత•త్వ దేశమనీ, అమెరికన్ల ఆరోగ్యానికి, జీవన విధానానికి పెనుముప్పు అనీ, కరోనా వైరస్ కు సంబంధించిన వాస్తవాలు మరుగుపరుస్తున్న దుష్ట దేశమనీ ఇలా రకరకాల విమర్శలను చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. అయితే ఇవన్నీ నిన్నటి ముచ్చట్లు. కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికన్లకు నేడు చైనాయే పెద్ద దిక్కు. అమెరికన్ల ప్రాణాలకు భరోసా.. కరోనా నుంచి కాపాడే ఆపద్బాంధవుడుగా చైనా నేడు కనిపిస్తోంది.
ఇఫ్పుడు చైనాను దేబరించాల్సిన పరిస్థితిని అధ్యక్షుడు ట్రంప్ సృష్టించాడు. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనాకు నేడు అమెరికా కేంద్ర స్థానంగా మారింది. ఏప్రిల్ 4వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. కరోనాను ఎదుర్కోనే వ్యూహాలు రూపొందించడంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలు చైనాకు లాభాలుగా మారాయి. కరోనా వ్యాపిస్తున్న ఆనవాళ్లు కనిపించిన వెంటనే ట్రంప్ ప్రభుత్వం వైద్యులు, రోగుల రక్షణకు అవసరమైన మాస్క్‌లు, డ్రెస్ లు, వెంటిలేటర్ల తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిల్వచేసి ఉంటే నేడు పరికరాల కొరత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. చివరకు మాస్క్‌లకు కూడా చైనాపై ఆధారపడాల్సి దుస్థితి వచ్చేది కాదు. వైద్యపరికరాలకోసం రక్షణ ఉత్పత్తుల చట్టాన్ని అమలు చేసే విషయంలో కూడా ట్రంప్ మీనమేషాలు లెక్కించారు. ఎట్టకేలకుఎన్ 95 మాస్క్‌లు, వెంటిలేటర్ల తయారీకి ఈ చట్టాన్ని వర్తింపజేసినా అప్పటికే జరగాల్సిన వైపరీత్యం జరిగిపోయింది. దాంతో వేలాది మంది అమెరికన్లు మరణించిన తరువాత గానీ వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఇ) ఎగుమతులపై ఆయన ఆంక్షలు విధించలేదు. దానికితోడు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన పిపిఇలను అందించలేని స్థితిని అమెరికా ఎదుర్కొంది. పిపిఇలు అందుబాటులో లేకపోవడంతో న్యూయార్క్ తో సహా అనేక రాష్ట్రాలు చైనా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. చైనా ఉదారత్వం వల్ల మాకు వెయ్యి వెంటిలేటర్లు అందాయని న్యూయార్క్ గవర్నర్ డ్రూ క్యూమో వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇప్పటికే 17 వేల వెంటిలేటర్ల కోసం చైనాకు ఆర్డర్లు ఇచ్చామని కూడా ఆయన తెలిపారు.
మరోవైపు కరోనా వైరస్‌కు మూలస్థానమైన చైనా నేడు అదే కరోనాతో పెద్దఎత్తున వ్యాపారం చేసి లాభపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నదని చైనా ఉత్పత్తిదారులు అంటున్నారు. ప్రస్తుతం 20 వేల వెంటిలేటర్లకు ఆర్డర్లున్నాయని వారు అంటున్నారు. కరోనా సంక్షోభాన్ని చైనా ఎలా సొమ్ము చేసుకుంటున్నదో ఈ ఒక్క ఉదంతంతోనే తెలుసుకోవచ్చు. ఇది చైనాకు ఆర్థికంగా లాభదాయకమే కాకుండా ఆపత్కాలంలో అమెరికాను సైతం ఆదుకున్నామని చెప్పుకునే అవకాశాన్ని చైనాకు ఇచ్చినట్లయిందని అమెరికాలోని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. తానే సంక్షోభాన్ని స•ష్టించి, ఆ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని కాపాడే సత్తా తనకే ఉన్నదని చెప్పుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నదని వారు అంటున్నారు.













