ఘనంగా డిటిఎల్ సి 20 సంవత్సరాల పండుగ
డిట్రాయిట్ నగరంలో మరోసారి తెలుగు సాహితీ వైభవం కనిపించింది. 20 సంవత్సరాల క్రితం చిన్న తెలుగు బుక్ క్లబ్ తో ప్రారంభమయ్యిన డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితీ (డిటీఎల్ సి) పుస్తకాలు చదవడంతోనే ఆగిపోక, నిక్కచ్చిగా విమర్శ చేయడం, ఎంతో శ్రమతో, నిరపేక్షతో, కేవలం తెలుగు సాహిత్యం పట్ల ప్రేమతో మరుగునపడిన పుస్తకాలను ప్రచురించే బాధ్యత తలకెత్తుకోవడం, తెలుగు భాషాసాహిత్యాల గురించిన సభలు నిర్వహించడం వంటివి చేస్తూ నిన్ననే 20 సంవత్సరాల పండుగను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 29-30 తేదీలలో ఈ 20 ఏళ్ల పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా నిర్వహించిన సదస్సులకు విశిష్ట అతిథి సందేశం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కీలకోపన్యాసంగా తెలుగును గుర్తించే పూనిక అనే అంశంపై స. వెం. రమేశ్ ప్రసంగించారు. రమేశ్ తన ప్రసంగంలో తమిళనాడులో ఉంటూనే తెలుగు మాట్లాడటం రాకున్నా, తెలుగు వారు అని తమిళులతో అనిపించుకుంటున్న వారికి తెలుగు మాట్లాడటం నేర్పడానికి ప్రామాణిక భాష అవసరం గురించి ప్రసంగించారు.
సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం జరిగిన సాహితీ సదస్సు ఆరి సీతా రామయ్య నిర్వహణలో జరిగింది. బసాబత్తిన శ్రీనివాసులు టెక్సాస్ రాష్ట్రంలో టాంటెక్స్ సాహిత్యవేదిక ద్వారా నిర్వహించే ”నెల నెలా తెలుగు వెన్నెల” అనే అంశంపై ప్రసంగించారు. వారి సమితి సమావేశాలు ప్రతి నెల వారు ఆహ్వానించే అతిధి మీద ఎక్కువ ఆధార పడి ఉంటాయి అని చెప్పారు. కొత్తగా పెట్టిన డి.సి., మేరీలాండ్, వర్జీనియా తెలుగు సమితిల గురించి గోపరాజు లక్ష్మి ప్రసంగించారు. వారు తమ సమావేశాలు అందరికీ సరిపోయే సమయం వెతికి ఎలా నిర్వహించగలుగుతున్నారో వివరించారు. న్యూజెర్సీ నుండి వచ్చి సాహిత్య వేదికల అవసరం – వాటిని నిర్వహించడంలో ఉన్న ఇబ్బందులు అనే అంశంపై కాశీనాథుని రాధ ప్రసంగించారు. ఒక ప్రాంతంలోనే ఎక్కువ దూరాలతో ఉంటున్న తెలుగు భాష మీద అభిమానం ఉన్నవారందరూ ఒక చిన్న తెలుగు సమావేశం నిర్వహించాలంటే ఉండే కష్టాలు చక్కగా వివరించారు.
చికాగో సాహితీ మిత్రులు అనే అంశంపై మెట్టుపల్లి జయదేవ్ ప్రసంగించారు. అమెరికాలో తెలుగు సాహితీ సమితులు తమ సమావేశాల వివరాలు, వాటిలో చరవాణిలో పాల్గొనే వివరాలు ఒకచోట పొందుపర్చితే వేరే ప్రాంతాలవారు ప్రస్తుతమున్న సాంకేతిక మాధ్యమాలతో తమకు నచ్చిన వాటిలో పాల్గొనవచ్చు అని అభిప్రాయం వ్యక్తం?చేశారు. సాహితీ సంస్థల మనుగడ ప్రశ్నార్ధకమేనా? అనే అంశంపై డిటీఎల్ సి నుండి వేములపల్లి రాఘవేంద్రచౌదరి ప్రసంగించారు. డి టీఎల్ సి పుట్టు పూర్వోత్తరాలు, ప్రవాసం లో ఉన్న తెలుగు సాహిత్య అభిమానుల కష్టసుఖాలు చెప్పారు. తెలుగు ఉంటేనే సాహితీ సంస్థలు ఉంటాయి అని చెప్పారు.
సెప్టెంబర్ 29 మధ్యాహ్నం జరిగిన ప్రామాణిక భాష సదస్సు వేములపల్లి రాఘవేంద్రచౌదరి నిర్వహణలో జరిగింది. పలికే భాష వ్రాతకు పనికొస్తుందా? అనే అంశంపై శ్రీమతి కూనపరెడ్డి గిరిజ ప్రసంగించారు. మధురమైన తెలుగు భాషకు ఒక ప్రామాణిక భాష ఉంటే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రపంచ భాషల్లో ప్రామాణికత అనే అంశంపై కొలిచాల సురేశ్ ప్రసంగించారు. వివిధ ప్రామాణిక భాషల గురించి వివరిస్తూ ఒక భాషకు ఒకటే ప్రామాణిక భాష అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ప్రామాణిక భాష- సాహిత్య విమర్శ, పరిశోధన అనే అంశంపై అఫ్సర్ ప్రసంగించారు. సాహిత్యంలో సూఫీ,దళిత, ప్రాంతీయవాదాల మూలంగా జరిగిన పరిణామాలు వివరించారు. ప్రామాణిక భాష రూపొందినతీరు కొన్ని అపోహలు అనే అంశంపై వాసిరెడ్డి నవీన్ ప్రసంగించారు.
సాహిత్యంలో, పలుకుబడి భాషలో ఎలా ఉన్నా శాస్త్రీయ పరిశోధన లో వివరణలకి భాషలో ప్రామాణిక అవసరం అన్నారు. ప్రామాణిక భాష ఎలా రూపొందించుకోవాలి? అనే అంశంపై స. వెం. రమేశ్ గారు ప్రసంగించారు. బడి,గుడి, ఏలుబడి లో నిలబడితేనే భాష బ్రతికి ఉంటుంది అని చెప్పారు. తమ ప్రాంతములో తెలుగురాని వారికి తెలుగు మాట్లాడడం నేర్పించడానికి తెలుగుకి ఒక ప్రామాణిక భాష కావాలి అన్నారు. సాయంత్రం మనబడి విద్యార్ధుల వినోద కార్యక్రమంలో అష్టదిగ్గజాల భువన విజయం ప్రదర్శనతో ప్రేక్షకులని అలరించారు.
సెప్టెంబర్ 30 ఉదయం నిర్వహించిన ప్రచురణ వ్యవస్థ సదస్సు మద్దిపాటి కృష్ణారావు నిర్వహణలో జరిగింది. తెలుగు పుస్తక ప్రచురణలో మనసు ఫౌండేషన్ అనుభవాలు అనే అంశంపై మన్నం వెంకట రాయుడు ప్రసంగించారు. లబ్దప్రతిష్టులైన రచయితల సమగ్ర రచనలు ఒక పుస్తక రూపానికి తేవడానికి చేసిన ప్రయత్నాలు, కష్టాలు వివరించారు. తెలుగు ప్రచురణ వ్యవస్థ, ఎడిటర్ అవసరం అనే అంశంపై డి. యస్. రావు ప్రసంగించారు. ప్రతి రచయితకు ఒక ఎడిటర్ వలన వచ్చే లాభాలు, రచయితల సహకార సంఘల వల్ల జరిగే లాభాలు పంచుకున్నారు. కవితా సంకలనాల ప్రచురణ – ప్రమాణాలు అనే అంశంపై విన్నకోట రవిశంకర్ ప్రసంగించారు. స్వయంప్రకాశులైన (తమ పుస్తకాలను తామే ప్రచురించుకునే) కవుల కు ఎదురయ్యే సమస్యలు, తన స్వానుభవాలు చెప్పారు.
తెలుగులో ప్రచురణా ప్రమాణాలు అనే అంశంపై వాసిరెడ్డి నవీన్ ప్రసంగించారు. ఒక తెలుగు స్టయిల్ మాన్యువల్ ఆవశ్యకత, దాని వలన వచ్చే లాభాలను చెప్పారు. తెలుగు ప్రచురణ వ్యవస్థ లో మార్పులు – సాహిత్యం పై ప్రభావం అనే అంశంపై రెంటాల కల్పన ప్రసంగించారు. డిజిటల్ మిడియాలో సారంగ పత్రికను నడపడం లో కలిగిన అనుభవాలు, మంచి పుస్తకానికి మంచి పద్దతిలో మార్కెటింగ్ చేయడం వల్ల జరిగిన పరిణామాలను పంచుకున్నారు. చరవాణిలో తెలుగు మాటల ఆటలు – అనుభవాలు అనే అంశంపై నందుల మురళీకష్ణ ప్రసంగించారు. పిల్లలకి చరవాణి లో తెలుగుపై తాను స్వయంగా తయారుచేసిన ఆటల ఆప్ వల్ల జరిగిన ఉపయోగాలు చెప్పారు. ఇ-ప్రచురణల రివ్యూ సౌలభ్యం, ఈమాట పద్ధతులు అనే అంశంపై మాచవరం మాధవ్ ప్రసంగించారు. ఒక ఎడిటర్ తనకు వచ్చే రచనల మంచి చెడ్డలు ఎంచి, రచయితలతో వారి రచనలు మార్పులు చేయించి పాఠకులకు, రచయితలకు ఎలా ఉపయోగ పడవచ్చు అని ఉదాహరణలతో వివరించారు. తెలుగులో వైజ్ఞానిక ప్రచురణలు అనే అంశంపై నరిశెట్టి ఇన్నయ్య ప్రసంగించారు. తెలుగులో మహిళా రచయితల వైజ్ఞానిక విషయాల వివరణ గ్రంధాలు చాలా తక్కువ ఉన్నాయి, వాటిని పెంచడం వలన ఉపయోగాలు పంచుకున్నారు. పుస్తక ప్రచురణ – సాధక బాధకాలు అనే అంశంపై ముత్తేవి రవీంద్రనాథ్ ప్రసంగించారు. ప్రస్తుత పుస్తక ప్రచురణలో ఎడిటర్ల వలన జరిగే తప్పులు, వారు చేయవలిసిన పరిశోధన వివరాలు చక్కగా వివరించారు.
వివిధ అంశాలతో జరిగిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది.













