భారత్ కు తిరుగులేని మద్దతు : అమెరికా
చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం అంశంపై తాము భారత్‌కు బలమైన, తిరుగులేని మద్దతును ఇచ్చినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఉన్నతాధికారి లీసా కర్టిస్ తెలిపారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా చేపడుతున్న దురుసు చర్యలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఆవశ్యకతను చాటి చెప్పాయని పేర్కొన్నారు. మేధోమథన సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన వర్చువల్ చర్చా వేదికలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురుసు వ్యవహారశైలిని ప్రదర్శిస్తోంది. ప్రపంచం మొత్తం కరోనా గుప్పెట్లో చిక్కుకున్న వేళ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది అని దుయ్యబట్టారు. చైనా దూకుడును అడ్డుకోవడానికి భారత్‌తో బంధాన్ని ఏర్పర్చుకోవాలన్న అమెరికా పట్టుదలను ఈ సంక్షోభం మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.













